తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం | - | Sakshi
Sakshi News home page

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

Published Mon, Apr 28 2025 7:06 AM | Last Updated on Mon, Apr 28 2025 7:06 AM

తరలివ

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

ప్రసంగిస్తున్న కేసీఆర్‌,

అభివాదం చేస్తున్న

కేసీఆర్‌

ఎల్కతుర్కి క్రాస్‌ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్‌రోడ్‌లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది.

తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది

6.59 గంటలకు మైక్‌ అందుకున్న కేసీఆర్‌.. గ్యాదరి బాలమల్లును మైక్‌ సౌండ్‌ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

బీఆర్‌ఎస్‌ పాలనను గుర్తు చేసిన కేసీఆర్‌

కాంగ్రెస్‌ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్‌ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్‌ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్‌ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఉనికి కోసం బీఆర్‌ఎస్‌పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌ పాలనకు.. కాంగ్రెస్‌ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు.

వైఎస్సార్‌ పాలనను..

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు.

సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు

రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌ రావులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వాహనాలతో నిండిన పార్కింగ్‌ స్థలాలు..

పూర్వ వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్‌ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి.

మరిన్ని సభా విశేషాలు

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం1
1/3

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం2
2/3

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం3
3/3

తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement