
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్: నిరుద్యోగ సమస్యను రూపు మాపుతామని, నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలోని సుమారు 75 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 12వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికై న 280మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. కలెక్టర్ పంజాబ్ నుంచి, ఎస్పీ మహారాష్ట్ర నుంచి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడాలని స్పష్టంచేశారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ జిల్లాలో 10వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరవేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగ అవకాశాలను
సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం

నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం