
ఫ్లెక్సీ వివాదం.. ఐదు గంటల నిరసన
లింగంపేట: మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. సుమారు ఐదు గంటల పాటు లింగంపేటలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద దళిత సంఘాలు ఏర్పాటు చేసిన ఫెక్సీలో మాజీ ఎమ్మెల్యే జాజాల, ఎమ్మెల్సీ కవిత ఫొటోలు ముద్రించి ఉండడాన్ని గమనించారు. అందులో ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఫొటో ముద్రించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఆ ఫెక్సీలు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన విగ్రహం వద్దకు చేరుకొని ఫెక్సీలను తొలగించాలని అంబేడ్కర్ సంఘం నాయకులకు సూచించారు. నిబంధనల ప్రకారం 50 ఫీట్ల దూరంలో ఎలాంటి ఫెక్సీలు ఉండవద్దన్నారు. ఫ్లెక్సీలను తొలగించడానికి అంగీకరించకపోవడంతో లింగంపేట ఎస్సై వెంకట్రావు ఈ విషయాన్ని ఎస్సై ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు.
సీఐ ప్రవర్తనతో పెరిగిన ఉద్రిక్తత
సీఐ రవీందర్‌నాయక్ లింగంపేటకు వచ్చి దళిత సంఘాల నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐ సూచనతో గ్రామ పంచాయతీ సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలు తొలగించి ట్రాక్టర్‌లో తరలిస్తుండగా దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు కూడా తొలగించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించనంటూనే ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సీఐ అసభ్య పదజాలంతో దూషించారని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మండల అంబేడ్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలును అరెస్టు చేసే క్రమంలో ఆయన చొక్కా చిరిగిపోగా ప్యాంటు ఊడిపోయింది. అర్ధనగ్నంగా ఉన్న సాయిలును పోలీసులు లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. విషయం తెలుసుకున్న మండలంలోని దళిత సంఘాల నేతలంతా వచ్చి ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేటకు చేరుకొని కామారెడ్డి –ఎల్లారెడ్డి చౌరస్తాలో బైఠాయించారు. దళితులను అవమానించిన సీఐ రవీందర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఎస్సైలు, పోలీసులు లింగంపేటకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. డీఎస్పీ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో చర్చలు జరిపారు. దళిత సంఘాల నేతల డిమాండ్ మేరకు అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎల్లారెడ్డి సీఐపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొనడంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నలుగురు దళిత నాయకులను
అరెస్టు చేసిన పోలీసులు
సీఐ క్షమాపణ చెప్పాలంటూ
దళిత సంఘాల పట్టు
డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ

ఫ్లెక్సీ వివాదం.. ఐదు గంటల నిరసన

ఫ్లెక్సీ వివాదం.. ఐదు గంటల నిరసన