Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Drones Seen At 26 Indian Locations, Blackouts In Several Cities1
దాయాది.. మళ్ళీ బరితెగింపు

దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్‌ మొదలు రాజస్తాన్‌ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్‌ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని రాజస్తాన్‌ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్‌ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్‌ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్‌ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్‌ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్‌ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్‌ శ్రీవాత్సవ సర్క్యులర్‌ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్‌ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్‌ దాడులకు పాక్‌ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్‌ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

Court responds to petition filed by YS Jagan2
వైఎస్‌ జగన్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి

సాక్షి, అమరావతి: జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్‌ డీజీ, ఎన్‌ఎస్‌జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్‌ ప్లస్‌ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్‌­పీఎఫ్‌ లేదా ఎన్‌ఎస్‌జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్‌ జగన్‌ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్‌ ప్లస్‌ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్‌ జగన్‌ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్‌ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు.

Rasi Phalalu: Daily Horoscope On 10-05-2025 In Telugu3
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.59 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: చిత్త రా.2.48 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.9.09 నుండి 10.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.7.46 నుండి 9.33 వరకు, శనిత్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17. మేషం: శుభకార్యాల ప్రస్తావన. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.కర్కాటకం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.సింహం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.తుల: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.వృశ్చికం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మీనం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

Miss World pageant to begin in Hyderabad on May 104
Miss World 2025: అందాల పండగ నేడే షురూ

సాక్షి, హైదరాబాద్‌: అందాల పండుగకు అంతా సిద్ధమైంది. 22 రోజుల పాటు హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు శనివారం ప్రారంభం కాబోతున్నాయి. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌.. తొలిసారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు అతిథ్యమిస్తోంది. పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా, ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. శనివారం మరికొందరు వస్తారని అంచనా వేస్తున్నారు. ‘మిస్‌ వరల్డ్‌’కనుసన్నల్లో కార్యక్రమాలు మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం గత రెండు నెలల్లో పలుమార్లు నగరానికి వచ్చి ఇక్కడి పరిస్థితులు, వసతులను పరిశీలించిన మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ జూలియా మోర్లే, పోటీల నిర్వహణపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 2న తేదీన.. నగరానికి చేరుకున్న ఆమె బృందం హైటెక్‌ సిటీలోని ట్రైడెంట్‌ హోటల్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి.. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభ వేడుకలకు సీఎం అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీ దారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. పదో తేదీతో ప్రారంభమయ్యే పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. 31న హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే జరుగుతుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్‌ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్‌ వరకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ (2024) ఫైనల్‌ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర గీతం ఆలాపనతో.. రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి నారాయణ స్వరాలు సమకూర్చనున్నారు. పది నిమిషాల పాటు ఈ నృత్య కార్యక్రమం కొనసాగనుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్‌ వరల్డ్‌ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు. కళారూపాల ప్రదర్శనతో కంటెస్టెంట్ల పరిచయం ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత కత్లే శ్రీధర్‌ బృందం నేతృత్వంలో ఆదిలాబాద్‌ గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటుంది. అప్పుడు మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక పైకి వస్తారు.తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పు వాయిద్య కార్యక్రమాన్ని ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్‌ బృందం, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలను స్వప్న బృందం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కూడా పోటీదారులను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్‌ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తారు. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు ఉంటుంది. సంప్రదాయ స్వాగతానికి మురిసిపోతూ.. ఈనెల మూడో తేదీ మొదలు నిత్యం సుందరీమ ణులు నగరానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ తిలకం దిద్ది, హారతి ఇస్తూ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్‌ నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. డప్పు వాయిద్యాలు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈకార్యక్రమాలు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. దీనిని విదేశీ అతిథులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండటం గమనార్హం.

Not against delimitation but south India should get 33 Percent representation says Revanth Reddy5
నాది లేటెస్ట్‌ మోడల్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్‌ మోడల్‌ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్‌. ప్రస్తుత తెలంగాణ మోడల్‌ 2025లో ఉన్న అప్‌ డేటెడ్‌ మోడల్‌. మోదీ మోడల్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ అయితే, నాది స్కిల్స్‌ యూనివర్సిటీ. గుజరాత్‌లో ఉద్యోగాల్లేవు. నేను ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చా. అక్కడ రైతుల రుణమాఫీ లేదు.. నేను రూ.21 వేల కోట్లు మాఫీ చేశా. గుజరాత్‌లో మద్దతు ధర లేదు. తెలంగాణలో మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడా ఇస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం.మేం రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తాం. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ మోడల్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదు. మా మోడల్‌లో ఈ స్వేచ్ఛ ఉంది. అందుకే మోదీ మోడల్‌ అవుట్‌ డేటెడ్‌. నాది అప్‌ టు డేట్‌ మోడల్‌. అందుకే తెలంగాణను కేంద్రం అనుసరిస్తోంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన ‘ది హిందూ హడిల్‌’ చర్చాగోష్టిలో ఆయన హైదరాబాద్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ‘ముందుగా ఈ దేశాన్ని రక్షిస్తున్న భారత ఆర్మికి సెల్యూట్‌ చేస్తున్నా. సైనికులకు సంఘీభావం ప్రకటించే సమయం ఇది..’ అని సీఎం అన్నారు. అనంతరం పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. కులగణన భవిష్యత్‌ తరాలకు దారి చూపిస్తుంది ‘సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌. దేశంలో లేదా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా కులగణన చేపడతామని ప్రజలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మేము చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. కులగణన చేయడం మినహా కేంద్రానికి మరో మార్గం లేదు. ఈ కులగణన భవిష్యత్‌ తరాలకు దారి చూపిస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎస్సీల్లో 59 కులాలున్నాయి.వీటిలో కొన్ని కులాలు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది. మేం వెంటనే రంగంలోకి దిగాం. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్‌ నియమించాం. ఈ కమిషన్‌ మూడు కేటగిరీల్లో ఎస్సీలను వర్గీకరించాలని చెప్పింది. ఆ సిఫారసుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థి దశలోనే కులం సమస్య గుర్తించా ‘గ్రామీణ ప్రాంతం నుంచి వచి్చన నాయకుడిగా సమాజంపై కులం ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు బాగా తెలుసు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆ సామాజిక వర్గాలకు చెందిన వారితోనే కలిసి ఉండడం ద్వారా సమాజం వారిని విస్మరిస్తోందని, దూరంగా ఉంచుతోందని గుర్తించా. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులాల పేరుతో విభజించి చదివించడం మంచిది కాదు. అందుకే నా కేబినెట్‌ సహచరులకు, అధికారులకు చెప్పా.అన్ని వర్గాల ప్రజలకు మంచి విద్యా సదుపాయాలు కల్పించాలని, మంచి వాతావరణంలో వారికి విద్యాబుద్ధులు నేర్పాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులందరినీ కలిపి చదివించాలని వారు సూచించారు. అందులో భాగంగానే యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా రూ.25 వేల కోట్ల పెట్టుబడి భవిష్యత్‌ కోసం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను చేపట్టాలి..’ అని రేవంత్‌ అన్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం.. ‘సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే మంచి మోడల్‌. అయితే సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి కలిసి ముందుకెళ్లాలి. నేను ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. రుణమాఫీ, పెట్టుబడి సాయం, మద్దతు ధర కోసం రైతులు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. మేం తొలి ఏడాదిలోనే 25.30 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి యేటా రూ.18 వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం. 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం. సోనియాగాంధీ నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకొచి్చన పథకమిది. ఈ పథకం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ధాన్యానికి మద్దతు ధర, బోనస్‌ కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ఇస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. నా పోటీ మన దేశ నగరాలతో కాదు.. ‘స్వయం సహాయక సంఘాల (67 లక్షల మంది) మహిళలకు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని 10 వేల ఆర్టీసీ బస్సుల్లో వెయ్యి బస్సులు మహిళలకు కేటాయించాం. విద్యార్థులు డ్రెస్సులు కుట్టే కాంట్రాక్టు మహిళలకు ఇచ్చాం. యువకుల కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దావోస్‌ వేదికగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో డ్రైపోర్టు, నెట్‌జీరో సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి భారత్‌ ఫ్యూచర్‌ సిటీగా నామకరణం చేశాం. నా పోటీ బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీలతో కాదు. న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్‌లు నా లక్ష్యం..’ అని రేవంత్‌ పేర్కొన్నారు. వన్‌ పర్సన్‌–వన్‌ పార్టీ విధానం అంగీకరించం ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు. అయితే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి నిబంధనలు రూపొందించాలని అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికన ముందుకెళితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్‌ కూడా నష్టపోతుంది. మీరు నియోజకవర్గాలను ఎలా పెంచినా మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. లేనిపక్షంలో అది నియోజకవర్గాల పునర్విభజన కాదు. వన్‌ పర్సన్‌–వన్‌ పార్టీ విధానం ఇది. దీన్ని మేం అంగీకరించేది లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన ఎం.కె.నారాయణన్‌ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెపుతున్నారంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హిందూ తెలంగాణ పొలిటికల్‌ ఎడిటర్‌ ఆర్‌.రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

BCCI suspends IPL matches6
వారం రోజుల విరామం

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2025 మ్యాచ్‌లకు బ్రేక్‌ పడింది. భారత్, పాకిస్తాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్‌ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్‌ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్‌ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్‌ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్‌ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్‌ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్‌ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్‌ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్‌ అసోసియేషన్‌’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్‌ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్‌ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్‌ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్‌ సీజన్‌ లీగ్‌ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్‌లలో ఒక్కో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్‌ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మే 25న ఐపీఎల్‌ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్‌ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్‌ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్‌ హెడర్‌’లుగా రోజుకు రెండు లీగ్‌ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్‌ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్‌ 20న మొదలవుతుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్‌ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్‌ సిరీస్‌ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్‌ వరకు లీగ్‌ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్‌ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్‌’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్‌’లో సగం జట్లను ఐపీఎల్‌ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్‌’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది.

US cannot control India and Pakistan says US VP Vance7
పాక్‌ చెయ్యి వదిలేసిన అమెరికా 

గిల్లి కయ్యం పెట్టుకోవటం.. గట్టిగా నాలుగు దెబ్బలు తగిలేసరికి అమెరికా కాళ్లపై పడి కాపాడాలని వేడుకోవటం.. ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్‌కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం.. 1971 నుంచీ పాకిస్తాన్‌ తీరు ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్‌ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా తెలిసి వచ్చింది. పొరుగుదేశంతో నువ్వు గొడవ పెట్టుకుంటే నిన్ను నేనెందుకు కాపాడాలని అమెరికా నిలదీస్తోంది. ‘భారత్‌–పాక్‌ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ విస్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో దాయాది దేశానికి దిక్కు తోచటం లేదు. కాపాడుతూ వచ్చిన అమెరికా 1971 యుద్ధం, 1999 కార్గిల్‌ యుద్ధం, 2001లో ఘర్షణ, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్, 2019 బాలాకోట్‌ వైమానిక దాడులు.. ఇలా భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ప్రతిసారీ పాకిస్తాన్‌ పాలకులు రాత్రికి రాత్రి అమెరికాలో వాలిపోయి కాపాడాలని ఆ దేశ పెద్దలకు మొరపెట్టుకున్నారు. నాడు పాకిస్తాన్‌ పక్షపాతిగా ఉన్న అమెరికా అడిగిందే తడవుగా రంగంలోకి దిగి భారత్‌తో చర్చలు జరిపి శాంతించేలా చేసేది. 1971 యుద్ధ సమయంలో పాక్‌కు మద్దతుగా ఏకంగా అణ్వాయుధాలు గల విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజ్‌ నాయకత్వంలో 7వ ఫ్లీట్‌ను బంగాళాఖాతంలో మోహరించింది. 1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌ను ఉగ్రమూకల ముసుగులో పాక్‌ సైన్యం ఆక్రమించింది. ఆలస్యంగా గుర్తించిన భారత సైన్యం.. భీకర దాడులతో వారిని తరిమికొట్టింది. అంతటితో వదలకూడదని పాక్‌పై సైనిక చర్యకు ప్రణాళిక వేసింది. భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి పాక్‌కు ఉప్పందించింది. దీంతో భయపడిన నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌.. అమెరికాకు పరుగు పెట్టి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌తో సమావేశమయ్యాడు. మొదట కార్గిల్‌ను తాము ఆక్రమించలేదని బుకాయించిన నవాజ్‌షరీఫ్‌.. క్లింటన్‌తో సమావేశం తర్వాత 1999, జూలై 12న కార్గిల్‌ నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. 2001లో పాక్‌ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయటంతో రెండు దేశాలు మరోసారి యుద్ధం ముందు నిలిచాయి. ఆ సమయంలో కూడా పాక్‌ను కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. తన రాయబారిని ఢిల్లీకి పంపి భారత్‌ను శాంతింపజేసింది. ఇలా దౌత్యంతోపాటు ఎప్పటికప్పుడు ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తూ పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం కాపాడుతూ వచ్చింది. ఎఫ్‌–16 సూపర్‌సోనిక్‌ యుద్ధ విమానాలను కూడా పాక్‌కు అందించింది. కాలం మారింది.. కథ అడ్డం తిరిగింది చాలాకాలంపాటు ఆత్మరక్షణ విధానాన్నే అవలంబించిన భారత్‌.. కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరుప్రతిష్టలు పెంచుకోవటంతోపాటు తెలివైన దౌత్య విధానాలతో కొత్త మిత్రులను సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్‌ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీ వాన్స్‌ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘చూడండి.. ఆయుధాలు వదిలేయాలని భారత్‌కుగానీ, పాకిస్తాన్‌కు గానీ మేము చెప్పలేము. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కూడా కాదు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఈ ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అణు యుద్ధంగా మారబోదనే నమ్ముతున్నాం’అని వాన్స్‌ పేర్కొన్నారు. వాన్స్‌ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్‌పై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుదారైన నిక్కీ హేలీ మరో బాంబు వేశారు. పహల్గాంలో సామాన్యులను చంపిన ఉగ్రవాదులను శిక్షించే హక్కు, అధికారం భారత్‌కు ఉన్నాయని ఆమె ఎక్స్‌ వేదికగా స్పష్టంచేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్‌కు చురకలంటించారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

SC stays women SSC army officers release from service8
మహిళా సైనికాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి 

న్యూఢిల్లీ: షార్ట్‌ సర్విసు కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది. తమకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్‌ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది.

Syndicated companies have won the works at high prices in the capitals construction tenders9
ఖజానాకు రూ.91.55 కోట్లు గండి

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో మరోసారి లాలూ‘ఛీ’పర్వం బట్టబయలైంది. ముఖ్య నేత ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల సిండికేట్‌లోని సంస్థలు అధిక ధరలకు పనులు దక్కించుకున్నాయి. కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కవడంతో కేవలం ఆరు ప్యాకేజీల టెండర్లలోనే ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల మేర భారం పడింది. ఈ సంస్థలు 4.41, 4.40, 4.39 శాతం అధిక ధరకు పనులను పొందడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. » గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్, టైప్‌–1, టైప్‌–2, క్లాస్‌–4 ఉద్యోగులకు నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు నాలుగు ప్యాకేజీల కింద రూ.1,659.30 కోట్ల అంచనా వ్య­యంతో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.454.78 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్‌ (అమరావతి డె­వ­లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) నిర్వహించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. » మొత్తం టెండర్ల అంచనా వ్యయం రూ.2,114.08 కోట్లు కాగా.. రూ.2,205.63 కోట్లకు సిండికేట్‌లోని మూడు కాంట్రాక్టు సంస్థలకు తలా రెండు ప్యాకేజీల చొప్పున ప్రభుత్వం పనులను అప్పగించింది. షాపూర్‌జీ పల్లోంజీ (రూ.709.12 కోట్లు), ఎల్‌అండ్‌టీ (రూ.1023.18 కోట్లు), మేఘా (రూ.473.33 కోట్లు) సంస్థలకు పనులను కట్టబెట్టింది. అధిక ధరలకు అప్పగించడంతో ఈ 6 ప్యాకేజీల పనుల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల భారం పడింది. » ఆరు ప్యాకేజీల పనుల టెండర్లను ఆమోదిస్తూ, వాటిని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడానికి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. » పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నాక కాంట్రాక్టు విలువలో పది శాతం ( రూ.220.56 కోట్లు) మేర మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పనున్నారు. ఇందులో ఎనిమిది శాతం ముఖ్య నేత.. రెండు శాతం కాంట్రాక్టు సంస్థలు పంచుకోవడం బహిరంగ రహస్యమని కాంట్ర­ê క్టు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇవీ.. » నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు నేలపాడు వద్ద ఎస్‌+12 విధానంలో 12 టవర్లలో 1,140 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.495.31 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. టెండర్లలో 4.40 శాతం అధికం (రూ.517.10 కోట్లు) కోట్‌ చేసి ఎల్‌అండ్‌టీ ఎల్‌–1గా నిలిచి పనులను దక్కించుకుంది. » గెజిటెడ్‌ ఆఫీసర్లు, టైప్‌–1, టైప్‌–2, క్లాస్‌–4 అధికారులకు ఎస్‌+12 విధానంలో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.492.77 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. 4.39 శాతం అధిక ధరకు (రూ.514.40 కోట్లు) టెండర్లు కోట్‌ చేసిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఎల్‌–1గా వచ్చి పనులను దక్కించుకుంది. » నేలపాడు వద్ద నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లకు ఎస్‌+12 విధానంలో 9 టవర్లలో 855 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.484.69 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. 4.41 శాతం అధిక ధరకు (రూ.506.06 కోట్లకు) కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచి ఎల్‌అండ్‌టీ సంస్థ పనులను చేజిక్కించుకుంది. » టైప్‌–1, టైప్‌–2 గెజిటెడ్‌ ఆఫీసర్లు, గ్రూప్‌–డి ఆఫీసర్లకు ఎస్‌+12 విధానంలో 14 టవర్లలో నిరి్మస్తున్న 1,440 ఫ్లాట్లకు తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ సీవరేజీ సిస్టమ్, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేపట్టిన పనుల్లో మిగిలినవాటిని పూర్తి చేయడానికి రూ.186.53 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి పిలిచిన టెండర్లలో 4.39 శాతం అధిక ధరకు (రూ.194.72 కోట్లు) కోట్‌ చేసి ఎల్‌–1గా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ పనులను దక్కించుకుంది. » ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకు పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల నిర్మాణానికి రూ.384.78 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో 4.10 శాతం అధిక ధరకు (రూ.400.55 కోట్లు) కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచి మేఘా సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీవరేజీ వంటి పన్నుల రూపంలో అదనంగా రూ.81.92 కోట్లు ఏడీసీఎల్‌ ఇవ్వనుంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.482.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన కి.మీ.కు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఇదే పద్ధతిలో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల వ్య­యంతోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తుండడం గమనార్హం. » ఈ–15 రహదారిని పొడిగించే పనులకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు (రూ.72.78 కోట్లు) కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది.

Funds diverted for the second time in a row in Polavaram10
మళ్లించేశారు

సాక్షి, అమరావతి: వరుసగా రెండోసారి పోలవరం నిధులను కూటమి ప్రభుత్వం మళ్లించేసింది..! ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురైనా తీరు మార్చుకోలేదు..! రెండు నెలల కిందట విడుదలైన మలి విడత నిధులను కూడా వాడేసింది..! కేంద్రం లెక్కలు అడుగుతుండడంతో అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది..! ఇలా పదేపదే నిధులను మళ్లించడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూ సేకరణలో జాప్యానికి కారణం అవుతోందని అధికారులు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు మార్చి 12న కేంద్ర ప్రభుత్వం రెండో విడత అడ్వాన్స్‌గా రూ.2,704.81 కోట్లు ఇచ్చింది. వీటిని తక్షణమే ఎస్‌ఎన్‌ఏ(సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమ చేయాలని సూచించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసింది. మిగతా రూ.2,504.81 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసిందనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, ఎస్‌ఎన్‌ఏకు జమ చేసినట్లుగా రసీదు పంపాలంటూ పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నుంచి రోజూ ఒత్తిడి వస్తుండడంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు.వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చొరవతో..పోలవరం నిధుల తిరిగి చెల్లింపు (రీయింబర్స్‌మెంట్‌) ప్రక్రియలో జాప్యంతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని, అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. తదనంతరం.. పోలవరం పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్‌ చేస్తూ.. రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్స్‌గా (మొత్తం రూ.2807.68 కోట్లు) విడుదల చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2024 అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. అదే రోజున రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. వీటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్‌ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. రెండో విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. కానీ, కూటమి ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే జమ చేసి, మిగతా నిధులను మళ్లించేసింది.నాడు గగ్గోలు.. నేడు అడ్వాన్స్‌లే మళ్లింపుగతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేసేది. అంటే.. కేంద్రం తిరిగిచ్చేది రాష్ట్ర ప్రభుత్వ నిధులే. వాటిని పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినియోగించింది. అయినా సరే, పోలవరం నిధులను మళ్లించేశారంటూ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధులను మళ్లించేయడం గమనార్హం. దీంతో కూటమి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇది రెండోసారి.. కేంద్రం గత ఏడాది అక్టోబరు 9న తొలి విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,348 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం మ­ళ్లించేసింది. అయితే, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరి రెండో వా­రంలో వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసింది. కేంద్రం మరోసారి అసహనం.. దాదాపు రెండు నెలల క్రితం విడుదల చేసిన అడ్వాన్స్‌ నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద పీపీఏ, కేంద్ర జలశక్తి శాఖ అసహనం వ్యక్తం చేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నిర్వాసితులకు, సేకరించాల్సిన భూమికి పరిహారం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్స్‌ నిధులను ఇలా వాడేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement