
లింగంపేటలో మహిళ దారుణ హత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన అమ్ముల లక్ష్మి(40) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. లక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకున్న ఒక్కాగానొక్క కూతురు శిరీషకు పెళ్లి చేసి పంపడంతో లక్ష్మి మాత్రమే ఇంట్లో ఉంటోంది. ఈ నెల 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చీరతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లగా, బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి తలుపులు తెరిచి చూడగా లక్ష్మి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. మృతురాలి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ పరిశీలించారు.