
అగ్నివీరులు.. అవుతారా?
ఖలీల్‌వాడి: త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉన్న యువకులను ఇండియన్ ఆర్మీ ప్రోత్సహిస్తోంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు అగ్నివీర్ ఎంపికలు నిర్వహిస్తోంది. అగ్నివీరులుగా ఎంపికై న వారికి నాలుగేళ్లపాటు ఐదంకెల వేతనం అందిస్తోంది. అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో గడువు తేదీని పొడిగించింది. అయితే ఈ ఉద్యోగం సాధించేందుకు గల అర్హతలు, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
అర్హతలు:
● అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల వరకు ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
● ఫిజికల్ టెస్ట్‌లో 1600 మీటర్ల పరుగు, పుల్ అప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ పరీక్షల్లో అర్హత సాధించాలి.
పరుగు పందెం..
అగ్నివీర్‌కు మొదటి పరీక్ష పరుగు పందెం. 1600 మీటర్ల పరుగును 5 నిమిషాల లోపు, అంతేకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఒకేసారి 300 మందికి పోటీ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మిగితా పరీక్షలకు అవకాశం ఉండదు.
జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ :
● పొడువుగా వంకర టింకరగా ఉన్న కర్ర(చెక్క)పై అభ్యర్థులు కిందపడకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనినే జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్ అంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది.
● పరుగెత్తుకుంటూ వచ్చి తొమ్మిది మీటర్ల గుంత అవతలి వైపు దూకాలి. దీనినే డచ్ పరీక్ష అంటారు. దీనికి కసరత్తు చేయాల్సి ఉంటుంది.
పుల్ అప్స్
ఈ పరీక్షలో పాస్ కావాలంటే తప్పనిసరిగా 10 పుల్ అప్స్ తీయాల్సి ఉంటుంది. ఎక్కువగా తీస్తే బోనస్ మార్కులు కూడా వస్తాయి. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు ఎంపిక చేసే అధికారులు అభ్యర్థి వైపు చూస్తూ గట్టిగా అరుస్తారు. భయపడకుండా శ్వాస తీసుకుంటూ పుల్ అప్స్ చేయాలి.
అర్హత పరీక్ష
ఎంపికై న అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండియన్ ఆర్మీ కార్యాలయం నుంచి సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నవారు అధికారులు సూచించిన పత్రాలతోపాటు మెడికల్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ అందిస్తారు. దీంతో భారతసైన్యంలో సైనికుడిగా శిక్షణ తీసుకుంటారు.
నేరుగా భారత సైన్యంలో
చేరే అవకాశం
దరఖాస్తుకు రేపే చివరి తేదీ