
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
● కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఐదు డీఏలు పెండింగ్‌లోనా ? ● టీజీఈజేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి
ఖమ్మం సహకారనగర్ : కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు కోరారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఖమ్మంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. 95 శాతం మంది ఉద్యోగులు జీతంపైనే ఆధారపడి ఉంటారని అన్నారు. బకాయి బిల్లులు నెలకు రూ.650 కోట్ల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హెల్త్ కార్డులపై పలుమార్లు ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పీఆర్‌సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని, వేతనాల సవరణకు 50 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లులను క్లియర్ చేయడంతో పాటు క్యాష్‌లెస్ హెల్త్‌కార్డులు అందించాలన్నారు. జీపీఎఫ్ రుణాలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలతో పాటు సరెండర్ లీవ్‌లు క్లియర్ చేయాలని కోరు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజా సంక్షేమ పథకాలు అమలుచేయడంలో చురుగ్గా పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా మంత్రుల పేషీల్లో ఉద్యోగ సంఘ నాయకులను గుర్తించడం లేదని ఆరోపించారు. మే 4న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ మన్నెబోయిన తిరుపతి, జిల్లా టీజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కన్వీనర్ కస్తాల సత్యనారాయణ, వివిధ సంఘాల నాయకులు యలమద్ది వెంకటేశ్వర్లు, పారుపల్లి నాగేశ్వరరావు, దేవరకొండ సైదులు, తుంబూరి సునీల్ రెడ్డి, మామునూరి రాజేష్, విజయ్, ఎ.వి నాగేశ్వరరావు, వీరస్వామి, కొణిదెన శ్రీనివాస్, మోదుగు వేలాద్రి, మల్లెల రవీంద్రప్రసాద్, కళ్యాణం కృష్ణయ్య, పరిస పుల్లయ్య, ఎం.సుబ్బయ్య, డాక్టర్ బాబు రత్నాకర్ పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది.

ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి