
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
మహానంది: మహానంది సమీపంలోని అరటి పొలాల్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా...? లేక ఎవరైనా ముందే హతమార్చి తీసుకొచ్చి నిప్పటించారా...? అనే విషయాలు తేలాల్సి ఉంది. నంద్యాల – మహానంది రహదారిలో ఎన్‌టీఆర్ విగ్రహం ఎదురుగా ఉన్న అరటి తోటల్లో ఉదయం మంటలు కనిపించడంతో కొందరు వెళ్లి చూడగా ఓ వ్యక్తి తగలబడుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, మహానంది, బండిఆత్మకూరు ఎస్‌ఐలు రామ్మోహన్ రెడ్డి, జగన్‌మోహన్‌లు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నంద్యాల జిల్లా ఫోరెన్సిక్ అధికారులు మృతదేహం వద్దకు చేరుకుని ఆధారాలు సేకరించే క్రమంలో వేలిముద్రలు, మృతుడు ధరించిన ఆంజనేయస్వామి డాలర్, కొన్ని కీలక భాగాలు సేకరించారు. వ్యక్తి అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. కుడికాలికి నల్లని ధారం, బట్టతల ఉండటంతో పాటు వయసు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుందని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా మృతి చెందిన వ్యక్తి టవల్‌తో అరటిచెట్టుకు నడుమును కట్టినట్లు కనిపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది తెలిస్తే కానీ పూర్తి వివరాలు తెలియని పరిస్థితి నెలకొంది. మృతదేహానికి ఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించి మహానందిలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
రంగంలోకి ఫోరెన్సిక్ అధికారులు,
డాగ్‌స్క్వాడ్