
నక్కవాగుల పల్లెలో పూరిగుడిసె దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తినష్టం
డోన్: కొత్తకోట మజరా గ్రామమైన నక్కవాగులపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం మహమ్మద్ రఫి అనే వ్యక్తికి చెందిన పూరిగుడిసె దగ్ధమైంది. కుటుంబీకులు పనికెళ్తూ గుడిసెకు తాళం వేసి వెళ్లారు. అయితే కొద్ది సేపటి తర్వాత గుడిసె దగ్ధమవుతుండటంతో గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చే లోగా గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 4 తులాల బంగారు నగలతో పాటు ఏడాదిపాటు నిల్వ ఉంచిన నిత్యావసర వస్తువులు, కొంత నగదు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు మహమ్మద్ రఫి కుటుంబం కన్నీరుమున్నీరైంది. దాదాపు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చంద్రన్న యాదవ్ తహసీల్దార్ నాగమణిని కోరారు.
చెరువులో వ్యక్తి గల్లంతు
పాణ్యం: భూపనపాడు గ్రామ చెరువులో అదే గ్రామానికి చెందిన బొని గెని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతైనట్లు కుటుంబీకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 13వ తేదీన వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలసి చెరువులో చేపట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ తెలియలేదని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
కృష్ణగిరి: మండల కేంద్రమైన కృష్ణగిరికి చెందిన పడిగే సుధాకర్ అనే వ్యక్తి నుంచి 13 బాక్స్‌ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరించారు. గ్రామ శివారులోని ఉప్పరి మాదన్న పొలం సమీపంలోని చేపల గుంత వద్ద పడిగే సుధాకర్ అక్రమంగా మద్యాన్ని దాచినట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. 1,248 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్ని నిందితున్ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మద్యాన్ని సరఫరా చేసిన తుగ్గలి మండలం కొత్తపల్లి గుడిసెల గ్రామానికి చెందిన రాజేంద్రపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు.

నక్కవాగుల పల్లెలో పూరిగుడిసె దగ్ధం