
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
మల్లన్న దర్శనానికి
పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పు ణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్స్ దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
గాలులు, మెరుపులతో వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలులు, మెరుపులతో వర్షం కురిసింది. జూపాడుబంగ్లా మండలంలో 33.75, పాములపాడు మండలంలో 28.5, వెల్దుర్తి మండలంలో 21.0, నందికొట్కూరులో 16.5, గూడూరులో 13.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో సాయంత్రానికి ఒక మోస్తరు వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. పెనుగాలుల తీవ్రతకు పలుచోట్ల తోటల్లోని మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. మామిడి రైతుకు నష్టం వాటిల్లింది.
ఇద్దరు ఏఈలకు పదోన్నతి
కోడుమూరు రూరల్: గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏఈగా పనిచేస్తున్న నారాయణ, ఎల్‌ఎల్‌సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈగా పనిచేస్తున్న మోహన్‌రావులకు ఆదివారం డీఈఈలుగా పదోన్నతి లభించింది. జీడీపీ ఎడమ కాల్వ ఏఈ నారాయణ డీఈఈగా పదోన్నతిపై వైఎస్సార్ జిల్లాకు వెళ్లగా, ఎల్‌ఎల్‌సీ కోడుమూరు సబ్ డివిజన్ ఏఈ మోహన్‌రావును అనంతపురం హెచ్‌ఎల్‌సీ కెనాల్ డీఈఈగా నియమిస్తూ ఉన్నతాధికారులు లేఖ విడుదల చేశారు.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలికి ప్రశాంత జీవనం గడపాలని రౌటీషీటర్లకు పోలీసు అధికారులు సూచించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీషీటర్లకు, నేర చరిత్ర ఉన్న వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఈస్టర్ వేడుకలను ఆదివారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పండుగ ప్రాముఖ్యతను మతపెద్దలు వివరించారు. పాపులను రక్షించడం గుడ్‌ఫ్రైడే సందేశమైతే, సత్యాన్ని అంతం చేయాలన్న ప్రతిసారీ ఏదో రూపంలో జన్మిస్తూనే ఉంటుందన్నది ఈస్టర్ నేర్పిన పాఠమని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలను విశ్వసించి సన్మార్గంలో నడువాలని సూచించారు. –కర్నూలు టౌన్

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు