
టీడీపీ నేత మమ్మల్ని వేధిస్తున్నాడు
● పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట
పత్తికొండ మహిళల ఆందోళన
కర్నూలు(రూరల్): పత్తికొండ షాడో ఎమ్మెల్యేగా చెలమణి అవుతున్న సాంబశివారెడ్డి తమను వేధిస్తున్నాడని అతనిపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ మహిళ ఐక్య వేదిక వ్యవస్థాపకురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షరాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో వారు బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న తమను కనీసం గౌరవం ఇవ్వకపోగా ప్రతి పనిలో అడ్డు తగులుతున్నాడని పత్తికొండ రామచంద్రరెడ్డినగర్, కొండగేరికి చెందిన పార్వతీబాయి, లలితాబాయి, కురువ లలిత, కురువ వరలక్ష్మి కుటుంబాలు వాపోయాయి. పొదుపు సంఘాల్లో జోక్యం చేసుకుంటూ విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌గా తుగ్గలి మహిళను తీసుకొచ్చి పెట్టారన్నారు. ఈ అన్యాయంపై అధికారులకు కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఆందోళనలో పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.