యూట్యూబ్‌లో చూసి.. చోరీ చేసి! | - | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో చూసి.. చోరీ చేసి!

Published Sun, Apr 27 2025 12:19 AM | Last Updated on Sun, Apr 27 2025 12:19 AM

యూట్యూబ్‌లో చూసి.. చోరీ చేసి!

యూట్యూబ్‌లో చూసి.. చోరీ చేసి!

కర్నూలు: కర్నూలులోని సాయి వైభవ్‌ నగర్‌లో నివాసముంటున్న ఆర్టీసీ డిపో–1 మేనేజర్‌ సర్దార్‌ హుసేన్‌ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. సీతారాం నగర్‌లో నివాసముంటూ దుర్గా హోటల్‌ పక్కన ఉన్న స్పైసీ డాబాలో పనిచేస్తున్న షేక్‌షావలితో పాటు ఐదుగురు మైనర్లు చోరీకి పాల్పడినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఎదుట హాజరుపర్చగా శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. షేక్‌షావలి సంతోష్‌ నగర్‌, కొండారెడ్డి నగర్‌, ఎన్‌టీఆర్‌ బిల్డింగ్స్‌ ప్రాంతాల్లో నివాసముంటున్న ఐదుగురు మైనర్లతో జట్టు కట్టి సర్దార్‌ హుసేన్‌ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ముందు రోజు ఇద్దరు మైనర్లు ద్విచక్ర వాహనంపై సాయి వైభవ్‌ నగర్‌లో రెక్కీ నిర్వహించారు. సర్దార్‌ హుసేన్‌ ఇళ్లు తాళం వేసి ఉండటంతో అర్ధరాత్రి ఆరుగురు నిందితులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి చొరబడి అందినమట్టుకు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు పనిమనిషి గుర్తించి సర్దార్‌ హుసేన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మూడో పట్టణ పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో షేక్‌షావలితో పాటు మరో ఐదుగురు మైనర్లను నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 27 తులాల బంగారు, 35 తులాల వెండి, నేరానికి ఉపయోగించిన రెండు మోటర్‌ సైకిళ్లు, రంపం, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు.

యూట్యూబ్‌లో చూసి...

దొంగతనం ఎలా చేయాలనే దానిని యూట్యూబ్‌లో వీడియోలు చూసి తాళాన్ని విరగ్గొట్టేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకుని రెండు బైక్‌లపై అర్ధరాత్రి నిందితులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. శబ్దం రాకుండా తాళం విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి వాటిని పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఇందులో ఇద్దరు మైనర్లు గతంలో ద్విచక్ర వాహనాల తాళాలు తీయడంలో నేర్పరులు. మైనర్లు ఐదుగురు కూడా పాఠశాలకు వెళ్లకుండా డ్రాపౌట్‌ అయి మెకానిక్‌ షెడ్డులో పనిచేస్తూ అల్లరిచిల్లరగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడి షేక్‌షావలితో జట్టు కట్టి చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను

వినియోగించుకోండి...

ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించాలని, ఇంటి భద్రత కోసం ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను వినియోగించుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు. కాలనీలో కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ ఖాజా హుసేన్‌, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు శేషయ్య, నాగశేఖర్‌ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేసును ఛేదించిన క్రైం పార్టీ సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు.

ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఇంట్లో

చోరీ చేసిన దొంగలు అరెస్టు

సాంకేతిక పరిజ్ఞానంతో

నిందితుల గుర్తింపు

27 తులాల బంగారు,

35 తులాల వెండి రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement