
సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆటకట్టిద్దాం
కర్నూలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్తుల ఆట కట్టిద్దామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో దీర్ఘకాలిక పెండింగ్ కేసులను సమీక్షించి పరిష్కారానికి సలహాలు, సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోషల్ మీడియాపై గట్టి నిఘా ఉంచాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా పుకార్లు వ్యాపింపజేస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆదివారం కచ్చితంగా రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.