● గ్రామంలో వంద మందికి పైగా జ్వరం ● ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాధితులు ● కన్నెత్తి చూడని వైద్యారోగ్యశాఖ అధికారులు
ఆస్పరి: మండలంలోని కలపరి గ్రామం మంచం పట్టింది. ఈ గ్రామంలో 110 కుటుంబాలుండగా, ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చూపించుకుంటున్నా తగ్గడం లేదని వాపోతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంటే వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటువైపు కన్నెతి చూసిన దాఖలాలు లేవు. వెంకమ్మ అనే వృద్ధురాలు పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మల్లమ్మ, మల్లికార్జున, ఉరుకుందు, సోమన్న, లక్ష్మి, మునిస్వామి, వీరేష్, వెంకటలక్ష్మి, ఆటో ఉరుకుందప్ప, సూరి, లోకేశ్వరీతో పాటు వందమంది వంద మంది జ్వరం, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఈ సమస్య ఉంది. ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరు జ్వరం బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య లోపమా లేక మరే కారణమో తెలియదని, అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మంచం పట్టిన కలపరి