
వసంతోత్సవానికి వేళాయె
కాజీపేట : స్వయంభుగా ప్రకాశితమై.. వేలాది మంది భక్తుల కోరికలను తీరుస్తూ.. ఇంటి ఇలవేల్పుగా భాసిల్లుతున్న శ్వేతార్క మూలగణపతి కాజీపేట పట్టణంలో కొలువై 27 ఏళ్లు పూర్తయ్యాయి. నిర్వీఘ్న పూజాలందుకుంటున్న శ్వేతార్కుడిని దర్శించి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దాతలు అందజేసిన రూ.3.5 కోట్లకు పైగా ఆర్థికసాయంతో ఒకే ప్రాంగణంలో శ్వేతార్కుడితోపాటు శైవ, వైష్ణవ సంప్రాదాయ పద్ధతుల్లో నిర్మితమైన ఆలయాల్లో 29 దేవతామూర్తులు కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న శ్వేతార్కాలయంలో రేపటినుంచి 4వ తేదీవరకు ఐదు రోజుల పాటు వసంతోత్సవ వేడుకలు కనుల పండువగా జరుగనున్నాయి.
ఆలయానికి ఇలా చేరుకోవాలి
శ్వేతార్కుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. భక్తులు కాజీపేట రైల్వే జంక్షన్‌లో రైలు, ప్రధాన రహదారిపై బస్సు దిగి చౌరస్తాకు వచ్చి 300 మీటర్ల దూరం సోమిడి రోడ్డు వైపు నడిస్తే చాలు శ్వేతార్క ఆలయం కన్పిస్తోంది. పండుగలతోపాటు ప్రతి మంగళవారం, శనివారం విశేష పూజలు నిర్వహిస్తుంటారు.
ఉత్సవాల వివరాలు
ఉత్సవాలను 30వ తేదీన లాంఛనంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ ప్రారంభిస్తారు. తాడూరి రేణుక బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. 1న లక్ష్మినారాయణుల కల్యాణం, సుదర్శన హోమం, లక్ష తమలపాకులతో అర్చన, పరవస్తు హరిషత నాగిని బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 2న ఆలయంలో శ్వేతార్క మూలగణపతికి పుట్టిన రోజు వేడుకలు జరిపించనున్నారు. 3న స్వామి వారికి గంగా జలం, నల్ల ద్రాక్ష రసంతో అభిషేకం, మృత్యుంజయ పాశుపాత, ఆయుష్య హోమం, శ్రీవల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం నిర్వహిస్తారు. లక్ష దమన అర్చన, బాలలచే కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. 4న పూర్ణాహుతి, సిద్దిబుద్ది సమేత శ్వేతార్కుడికి కల్యాణ వేడుకలతో ఉత్సవాలు ముగించడం జరుగుతుందని ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ పేర్కొన్నారు.
శ్వేతార్క ఆలయం ముస్తాబు
రేపటి నుంచే వేడుకలు ప్రారంభం
రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల రాక
చారిత్రక నేపథ్యం..
ఆలయ వ్యవస్థాపకుడు, ఇటీవల శివైక్యం చెందిన ఐనవోలు అనంత మల్లయ్య శర్మకు 1999లో గణపతి దేవుడు స్వప్నంలో సాక్షత్కారించి నల్లగొండ జిల్లాలోని మాడా ప్రభాకర్‌శర్మ ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు మొదలులో ఉన్నట్లుగా చెప్పి అదృశ్యమయ్యాడు. ఉదయం లేచి తర్వాత పెద్దలకు విషయం తెలిపి జిల్లెడు చెట్టు వేరులో ఉన్న స్వామివారి మూర్తిని గ్రహించి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కాజీపేటలో ప్రతిష్ఠించారు. 2009లో పద్దెనిమిదిన్నర కిలోల వెండి కవచాన్ని శ్వేతార్కుడికి తొడిగి స్థిర ప్రతిష్ఠచేశారు. 2010లో దేశ చరిత్రలోనే స్వామివారికి గణాధిపత్యయోగ పట్టాభిషేకం జరిపించారు. ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శిల్పుల చేతిలో శ్వేతార్క ఆలయం రూపుదిద్దుకుంది.ఆలయ శిఖరంపైకి చేరుకుని గుడి వెనక భాగం వైపు చూస్తే గణపతి దేవుడి వాహనమైన ఎలుకను పోలిన కొండ కన్పిస్తోందని భక్తులు చెబుతుంటారు.

వసంతోత్సవానికి వేళాయె