
డీ–1 ప్రదేశంలో తవ్వకాలు
అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం జరిగిన డీ–1 ప్రదేశంలో మరో 25 మీటర్లు మేర శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. డీ–2 ప్రదేశంలో శిథిలాలు, మట్టి తొలగింపు పనులు దాదాపుగా పూర్తికావడంతో గల్లంతైన కార్మికులు నిషేధిత ప్రదేశంలోనే ఉన్నట్లు సహాయక బృందాల ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. డేంజన్ జోన్‌లో ఇప్పట్లో సహాయక చర్యలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. గత ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి 58 రోజులపాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం నిషేధిత ప్రదేశం సమీపంలో మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. ఆ ప్రదేశంలో టీబీఎం భాగాలు కత్తిరించే పని ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కీలకమైన స్టీల్ భాగాలను తొలగిస్తే మరో వారం రోజుల్లో శిథిలాల తొలగింపు పనులు పూర్తవుతాయని సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, ఆర్మీ వంటి 12 విభాగాలకు చెందిన 450 మంది సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. షిఫ్ట్‌ల వారీగా కొంత మంది సిబ్బంది వెళ్లిపోగా.. వారి స్థానంలో కొత్తవారు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. థర్మల్ కట్టర్‌తో కట్ చేసిన టీబీఎం స్టీల్ భాగాలు, బండరాళ్లను లోకో ట్రైన్ ద్వారా.. మట్టి, బురదను కన్వేయర్ బెల్టుపై సొరంగం బయటకు తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశం నుంచి ఉబ్బికి వస్తున్న నీటి ఊటను 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లతో బయటకు తోడేస్తున్నారు.