
ప్రపంచ దేశాల్లో శాంతి కరువు
జడ్చర్ల టౌన్: ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా హింస, విధ్వంసం, దుఃఖం గోచరిస్తుందని ఉదయమిత్ర అనువాదించిన సొంతూరు కవితల ద్వారా మరోసారి అవగతమవుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కవి ఉదయమిత్ర అనువాదించిన సొంతూరు, అవిలివల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా శాంతి కరువైందని.. హింస, ప్రాణనష్టం, కోల్పోతున్న విలువలు, యుద్ధ వాతావరణం కనిపిస్తున్నాయన్నారు. దేశాల పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా కవులు స్పందిస్తున్నారని.. వారి కవిత్వంలో మానవీయ విలువలు గోచరిస్తున్నాయన్నారు. అమానవీయ ప్రపంచంలో ఉన్నట్టుగా కవులు బలంగా తమ వాదనలు వినిపిస్తున్నారని.. వారు క్షుణ్ణంగా జీవితానుభవాలను వెలిబుచ్చుతున్నారని అన్నారు. ఆయా దేశాల కవులు రచించిన కవితలు, రచనలను ఉదయమిత్ర సొంతూరులో అనువాదించడం అభినందనీయమన్నారు. సాహిత్యం చరిత్ర చూస్తే 1930లో గొప్పగా కనిపిస్తుందన్నారు. ఆ కాలంలో శ్రీశ్రీది విప్లవ కవిత్వం అయితే.. కృష్ణశాస్త్రిది భావకవిత్వమన్నారు. అయితే కాలక్రమేణ భావకవిత్వం కనుమరుగైందని.. ఇప్పుడు అలాంటివారు కనిపించరన్నారు. ప్రకృతి రమణీయతను వర్ణించే కవులు లేరన్నారు. ప్రస్తుతం ప్రకృతిలోని విధ్వంసాన్ని చూస్తున్నామని, కవులు వినిపిస్తున్నారన్నారు. అవిలివలలో సాంకేతికత వల్ల జరిగిన నష్టం గురించి వివరించారన్నారు. ఏఐ ద్వారా భవిష్యత్ ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు. టెక్నాలజీ అమానవీయంగా మారితే ఎలాంటి దుష్ప్రరిణామాలు సంభవిస్తాయో అంతుపట్టకుండా ఉందన్నారు. సాంకేతికత విధ్వంసం సృష్టించడం ఖాయమన్నారు. వాస్తవ జీవితంలో కలిగిన సంఘటనలు, అనుభవాలను కవితల రూపంలో ఉదయమిత్ర తీసుకువచ్చారని కొనియాడారు. కాగా, సొంతూరు పుస్తకాన్ని శ్రీరామ్ పుష్పాల, సతీశ్ బైరెడ్డిలు పరిచయం చేయగా.. అవిలివల పుస్తకాన్ని డా.సుభాషిణి, నారాయణ పరిచయం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, జనజ్వాల, చాంద్‌ఖాన్, ఖలీల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఏఐతో మరింత విధ్వంసం తప్పదు
సొంతూరు, అవిలివల పుస్తకాల
ఆవిష్కరణ సభలో ప్రొ.హరగోపాల్