
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫోరం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా గత 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, 2017 పీఆర్‌సీకి సంబంధించిన ఏరియర్స్, ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాల్సిన ఎస్‌ఆర్‌బీఎస్ డబ్బులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జీబీ పాల్, ఆర్.నారాయణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు 10వ తేదీలోగా చెల్లించాల్సిన ఎస్‌ఆర్‌బీఎస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకే విడతల వారీగా ఈ నెల 16వరకు చెల్లించారని, ఇంకా డీఏలు, 2021 పీఆర్‌సీ ఇవ్వాల్సిఉందని, అలాగే పీఎఫ్, సీపీఎస్‌లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించకుండా నియామకాలను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. సమావేశంలో నాగాంజనేయులు, లలితమ్మ, నర్సింలు, మనోహర్, బుచ్చన్న, రియాజుద్దీన్, తదితరుల పాల్గొన్నారు.