
వరప్రదాయిని కోయిల్‌సాగర్
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయాన్ని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడానికి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అధికారులు సిద్ధమయ్యారు. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీటిని అందించిన ప్రాజెక్టు ఇప్పుడు 340 గ్రామాల ప్రజలకు నాలుగు నెలల పాటు తాగునీటిని అందించనుంది. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న మూడు పంప్‌హౌజ్‌ల నుంచి రోజు తాగునీటిని సరఫరా చేయనున్నారు. దేవరకద్ర వైపు ఉన్న పంప్‌హౌజ్ నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, నారాయణపేట, మక్తల్ మండలాలకు.. కోయిల్‌కొండ వైపు ఉన్న రెండు పంప్‌హౌజ్‌ల నుంచి కొడంగల్, కోస్గి, కోయిలకొండ తదితర ప్రాంతాలకు తాగునీటిని అందించనున్నారు. ఏడాది మొత్తం శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణా జలాలను మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తుండగా.. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు కోయిల్‌సాగర్‌ను ఉపయోగించుకుంటారు.
వానాకాలం సీజన్‌లో..
2.27 టీఎంసీల సామర్థ్యం ఉన్న కోయిల్‌సాగర్ జలాశయం నుంచి వానాకాలం సీజన్‌లో సుమారు 35 వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణానికి సాగునీటిని అందించారు. వానాకాలంలో ప్రాజెక్టులోకి వస్తున్న నీటికి సమానంగా కాల్వలకు మూడునెలల పాటు నిరంతరంగా నీటిని వదలడంతో ఇది సాధ్యమైంది. అలాగే గొలుసు కట్టు చెరువులను కూడా నింపడానికి ప్రాజెక్టు ఉపయోగపడింది. ఇక జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని లింక్ కెనాల్స్ ద్వారా పంటలకు వదలడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ఉపయోగపడింది. ఇక యాసంగిలో ప్రాజెక్టులోని నిల్వ నీటిని విడతల వారీగా పంటలకు వదలడంతో నీటిమట్టం 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి సీజన్‌లో పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాలకు సాగునీరు అందించారు.
తాగునీటికి 0.28 టీఎంసీలు..
ప్రాజెక్టులోని సగం నీరు నాలుగు నెలల పాటు 340 గ్రామాలకు సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 13.3 అడుగులు అంటే 0.55 టీఎంసీలు ఉంది. ఇందులో 0.27 టీఎంసీల నీటిని చేపల కోసం ప్రాజెక్టులో నిల్వ చేసి మిగతా 0.28 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తాం. రోజు పంపుల ద్వారా ఏ మేరకు నీటిని సరఫరా చేస్తున్నామని లెక్కించి నాలుగు నెలల పాటు తాగునీటిని అందించేందుకు నిర్ణయించాం. – ప్రతాప్‌సింగ్, ఈఈ,
కోయిల్‌సాగర్ జలాశయం
వేసవిలో ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా
ప్రస్తుతం 13.3 అడుగుల నీటిమట్టం
340 గ్రామాలకు..
నాలుగు నెలల పాటు

వరప్రదాయిని కోయిల్‌సాగర్

వరప్రదాయిని కోయిల్‌సాగర్