
చివరి దశకు సహాయక చర్యలు
అచ్చంపేట: దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 62వ రోజు గురువారం డీ2 ప్రదేశం చివరన సహాయక సిబ్బంది శిథిలాలు తొలగించి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు. నిషేధిత ప్రదేశం అతి సమీపంలో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది థర్మల్ గ్యాస్‌కట్టర్ సాయంతో టీబీఎం ప్లాట్‌ఫామ్‌ను కత్తిరించి స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు తీసుకొచ్చారు. మిగిలిన మరో మూడు మీటర్ల శిథిలాల తొలగింపు పనులు శుక్ర, శనివారం ముగుస్తాయని సహాయక సిబ్బంది చెబుతున్నారు. డీ2 ప్రదేశం వరకు శిథిలాలు పూర్తిగా తొలగించినా కార్మికుల జాడ కనిపించలేదు. నిషేధిత 43 మీటర్ల ప్రదేశంలో 30 అడుగుల మేర నిండుకున్న శిథిలాల కింద కార్మికులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డీ1 ప్రదేశంలో బలహీనంగా ఉన్న కాంక్రీట్ సెగ్మెంట్లకు సపోర్టుగా సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం టైగర్ కాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే ప్రమాదం జరిగే ప్రమాదం ఉండటంతో నిషేధిత ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో శిథిలాలను పూర్తిగా తొలగిస్తే కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 150 హెచ్‌పీ సామర్థ్యం గల 5 భారీ మోటార్లతో నీటి ఊటను కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు.
డీ1పైనే అందరి దృష్టి..
ఇప్పుడు అందరి దృష్టి నిషేధిత ప్రదేశం డీ1పైనే ఉంది. ఈ ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగిస్తారా! లేక నిలిపివేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిషేధిత ప్రదేశం నుంచి సొరంగం తవ్వకాలు చేపట్టడం అంత శ్రేయస్కరం కాదని ఇప్పటికే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో సొరంగ మార్గం మళ్లించే అవకాశాలు ఉన్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. అందుకే కంచె ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు పూర్తిగా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. తవ్వకాలు కొనసాగిస్తారా లేదా అనే దానిపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నేటితో పూర్తికానున్న శిథిలాల తొలగింపు
62 రోజలైనా దొరకని ఆరుగురి ఆచూకీ