
నీటి గుంతలో పడి మహిళ మృతి
బిజినేపల్లి: మండల కేంద్రానికి చెందిన జుంపాల లక్ష్మమ్మ (55) పాటు కాల్వ నీటి గుంతలో పడి మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. లక్ష్మమ్మ తోటి కూలీలతో కలిసి బుధవారం ఉపాధి పనులకు బయలుదేరింది. మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు పాటు కాల్వ గుంతలో పడిపోయింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెదికారు. గురువారం కాల్వలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. లక్ష్మమ్మకు భర్త వెంకటయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
పూడూరులో వృద్ధురాలు..
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని పూడూరుకు చెందిన బోయ రత్నమ్మ (75) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడ వాకాబు చేసినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం కృష్ణ అగ్రహారం సమీపంలోని కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
వ్యక్తి బలవన్మరణం
ఉండవెల్లి: మండలంలోని బొంకూరుకు చెందిన కుర్వ మధు (34) పురుగు మందు తాగి కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ మహేశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన మధు బుధవారం రాత్రి పొలం వద్ద పురుగుమందు తాగి రాముడుకు ఫోన్ చేశాడు. తాతాల ఆస్తి దక్కడం లేదని.. అందుకు పొలం వద్ద పురుగు మందు తాగానని చెప్పాడు. దీంతో రాముడు ఘటన స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
కుళ్లిన మృతదేహం లభ్యం
అడ్డాకుల: మండల కేంద్రంలోని ఓ ఇంటిపై ఓ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్‌బాలీ కుమారుడు ముస్తాక్ (37) మానసిక స్థితి బాగోలేక మద్యానికి బానిసై రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. కొన్నాళ్లుగా ఇంటికి కొంతదూరంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై రాత్రిళ్లు పడుకుంటుండేవాడు. గురువారం సాయంత్రం ఓ కుక్క మనిషి చేతిని నోట కురుచుకొని గ్రామంలోని ప్రధాన రహదారిపైకి వచ్చింది. గుర్తించిన స్థానికులు చుట్టుపక్కల వెదకగా.. ఇంటిపై కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించగా ముస్తాక్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
వ్యక్తి హఠాన్మరణం..
కేసు నమోదు
రాజాపూర్ (బాలానగర్): పొట్టకూటి కోసం వచ్చి కూలీ పనులు చేసే ఓ వ్యక్తి హఠాత్తుగా మృతిచెందిన ఘటన గురువారం బాలానగర్ మండలం నేలబండతండాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ కథనం మేరకు.. ఒడిస్సా రాష్ట్రం అతిబంధ చర్యాలనుపాడకు చెందిన త్రినాథబోయి (55) 5 నెలల కిందట నేలబండతండాలో రామావత్ రాజు దగ్గర ఇటుకబట్టిలో పనిచేసేందుకు వచ్చాడు. బుధవారం త్రినాథబోయికి ఛాతిలో నొప్పి వస్తుండటంతో ఆటోలో బాలానగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
హన్వాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహమ్మదాబాద్ మండలం షేక్‌పల్లికి చెందిన సందీప్ (20) బైక్‌పై కోయిల్‌కొండలోని బంధువుల ఇంటికి బయలుదేరాడు. మండలంలోని హనుమాన్ టెంపుల్‌తండా సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ కారు బైక్‌ను బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి అటు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. తల్లి సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.