మల్లమ్మకుంట మర్చిపోవాల్సిందేనా?
● రిజర్వాయర్ రద్దు చేయాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన ఎంపీ
● నీటిపారుదలశాఖ అధికారులకు సిఫారస్ చేసిన కలెక్టర్
● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కలెక్టర్ లేఖ
● ఎంపీ తీరుపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు
శాంతినగర్: మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై మళ్లీ రగడ మొదలైంది. అధికార పార్టీ ఎంపీ మల్లు రవి రిజర్వాయర్‌ను రద్దు చేయాలంటూ కలెక్టర్‌కు సూచించడంతో ఆశలు నిరాశలయ్యే అవకాశాలు లేకపోలేదు. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు చేయాలంటూ కలెక్టర్ నీటి పారుదలశాఖ అధికారులకు రాసిన లేఖ గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించి రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌తో పాటు వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట, జూలకల్ సమీపంలో రిజర్వాయర్, ఇటిక్యాల మండలం వల్లూరు సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.783 కోట్లు అవసరమని జీఓ పాస్ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.162 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించి ఆర్డీఎస్‌కు అనుసంధానం చేసి తనగల వద్ద నీటిని పంపింగ్ చేస్తూ కొంత మేర సాగునీటి సమస్య తీర్చగలిగారు. రెండో దశలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ రావడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి ముందుకొచ్చి గతేడాది సర్వే పనులు చేపట్టారు. అప్పట్లో తనగల రైతులు సర్వే అధికారులను అడ్డుకొని నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాలని లేదంటే వేరే చోట భూమి ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి సర్దిచెప్పి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టారు. పనులు ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో గురువారం కలెక్టర్ నీటిపారుదలశాఖ అధికారులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఆయకట్టు రైతులనుంచేగాక సొంతపార్టీ నాయకుల నుంచి ఎంపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 250 మంది దళిత రైతులు 567 ఎకరాల భూమి కోల్పోతారని.. 100 గ్రామాల రైతులు, వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వం చేతగానితనమే అంటూ పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు విషయమై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని అలంపూర్ నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.


