
సైబర్ మోసాల నివారణకు.. అప్రమత్తతే ప్రధానం
● మహబూబ్‌నగర్ టూటౌన్ పీఎస్ పరిధిలో ఇండియా హిల్ హౌస్ కాంపిటీషన్ పేరుతో పెట్టుబడి మోసం చేశారు. ఇందుకు వికాసా క్యాపిటల్ పేరు ఉపయోగించి ఫేక్ డీమ్యాట్ ఖాతా, ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ. 15.5 లక్షలు మోసం చేశారని.. తర్వాత మరో రూ. 42లక్షలు అడగడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశారు.
మహబూబ్‌నగర్ క్రైం: ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే డయల్ 1930 లేదా ఛి డఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీ ుఽ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. మోసపోయిన బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే త్వరగా న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం వాట్సప్‌లో వీడియో కాల్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. గుర్తింపు లేని వెబ్‌సైట్ వెతకడం, ఓపెన్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్ హ్యాక్ అయ్యి.. సోషల్ మీడియా నందు అశ్లీల ఫొటోలతో పోస్టులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారన్నారు. యాప్స్‌లో యువత బెట్టింగ్ కాస్తూ కష్టార్జిత సొమ్ము కోల్పోతున్నారని.. వీటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌తో బెట్టింగ్ యజమాని, నిర్వాహకుడు మాత్రమే చివరకు ధనవంతుడు అవుతారనే విషయాన్ని గ్రహించాలని యువతకు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో ఫేక్ యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మోసపోతామని గ్రహించాలని తెలిపారు. మహబూబ్‌నగర్ సైబర్ క్రైం విభాగం బాధితులకు త్వరగా న్యాయం చేకూర్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో 29 సైబర్ క్రైమ్స్ నమోదు కాగా.. 20 కేసులు ఆర్థిక నేరాలు, 9 కేసులు ఆర్థికేతర కేసులు నమోదయ్యాని చెప్పారు.
కొన్ని కేసులు ఇలా..
మహబూబ్‌నగర్ రూరల్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి అజ్ఞాత వ్యక్తి కాల్‌చేసి.. తాను ఇండియా బుల్స్ లోన్ ఎగ్జిక్యూటివ్‌గా చెబుకున్నాడు. రుణ ఆమోదానికి ఫీజు పేరుతో బాధితుడి వద్ద రూ. 1,60,654 వసూలు చేశాడు. మరిన్ని డిమాండ్లు రావడంతో బాధితుడు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు.
● మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పీఎస్ పరిధిలో బాధితురాలు ఫేస్‌బుక్ స్క్రోల్ చేసిన వెంటనే వాట్సప్ ద్వారా దొంగలు సంప్రదించి.. మొదట కొన్ని లాభాలు చూపించారు. ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడికి ఒత్తిడి చేశారని, చివరికి రూ. 47వేలు మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు.
● బాలానగర్‌లో బాధితుడికి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా గూగుల్ సమీక్షల పనులు ఇచ్చి.. ప్రీపెయిడ్ పెట్టుబడి కోరారు. అతడు రూ. 1,72,986 పంపించిన తర్వాత మోసపోయినట్లు గుర్తించారు.
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
●25.09 తులాల బంగారం రికవరీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆరు నెలల నుంచి ముప్పతిప్పలు పెడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర గజదొంగ ఆమోల్ రాందాస్ పవార్ (38)ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి నుంచి 25 తులాల 9 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రంలోని సోలాపూర్ జిల్లా మహోల్ తాలూకా ఎల్లంవాడికి చెందిన ఆమోల్ రాందాస్ పవార్ చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు చేయడంతో పాటు రైల్వే డకాయిటి, దారి దోపిడీలు, హెబ్బీ నైట్స్ లాంటి అనేక నేరాలకు పాల్పడే వాడు. అతడి ప్రధాన దొంగతనం మాత్రం బంగారమే లక్ష్యంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో 50 నుంచి 100 వరకు వివిధ రకాల కేసులు ఉన్నాయి. కొన్ని చోట్ల వారెంట్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో జైలు నుంచి విడుదలయ్యాక.. ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడానికి ఒక కారును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన కులస్తులైన సచిన్, ఆకాశ్ భట్, ఆకాశ్‌లతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌లో 6 నెలల వ్యవధిలో 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడి దాదాపు 25 తులాల 9 గ్రాముల బంగారం అపహరించారు. ఆమోల్ రాందాస్ పవార్ శనివారం తన స్నేహితులతో కలిసి మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో దొంగిలించిన బంగారాన్ని అమ్మడానికి వచ్చిన క్రమంలో మహబూబ్‌నగర్, జడ్చర్ల రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడని.. మిగతా నేరస్తులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతడి నుంచి దొంగతనానికి వినియోగించిన కట్టర్, ఐరన్ రాడ్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. సమావేశంలో మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, జడ్చర్ల సీఐ నాగార్జునగౌడ్ ఉన్నారు.
బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి
ఆన్‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్‌కు పాల్పడటం చట్ట విరుద్ధం
మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి