
రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్ వాసి...
నేరడిగొండ: మండలంలోని కుప్టి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్ గుజర్ (20) కుప్టి వద్ద గల ధాబా హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్ యజమాని పని నిమిత్తం రాజస్థాన్‌కు వెళ్తున్న క్రమంలో అతన్ని బస్సు ఎక్కించి హోటల్‌కు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్ శివారులోని సరస్వతి కాలువలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. రాచాపూర్ కారోబార్ రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ వర్మ, ప్రొబేషనరీ ఎస్సై జుబేర్ తెలిపారు.
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామ సమీపంలో పెన్‌గంగ నదిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతునికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు.