
సూపర్ స్టార్ కృష్ణ(79) మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైరాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై ఘట్టమనేని కుటుంబం స్పందించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు మీడియా ప్రకటన విడుదల చేశారు. ‘కృష్ణ నిజజీవితంలోనూ సూపర్ స్టారే. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కృష్ణగారి మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఆయన ఎంతోమందికి ఆదర్శం’ అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: మాటలకు అందని విషాదం ఇది: కృష్ణ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి
ఏడాది వ్యవధిలోనే ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేకోవడం విచారకరం. జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్ను మూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన పరిస్థితి విషమించి జనవరి 8న తుది శ్వాస విడిచారు. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే మహేశ్ తల్లి, కృష్ణ సతీమణి.. ఇందిరాదేవి సెప్టెంబర్ 28న దూరం కావడం.. తల్లి మరణించిన రెండు నెలలలోపే తండ్రి కృష్ణ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణారవార్తతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.