ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Published Sat, Apr 26 2025 1:07 AM | Last Updated on Sat, Apr 26 2025 4:25 PM

ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన వైనం

వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

పక్షులు, పశువులకు తాగునీరు అందుబాటులో ఉంచుదాం..

వాహనాల బ్యాటరీపై అధిక లోడ్‌  ఉండకుండా చూసుకోవాలి..

ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో కోల్‌బెల్ట్‌ ఏరియా అయిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. 

ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్‌గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్‌ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..

ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకో వాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.

● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.

● తేలిగ్గా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి

● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.

● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.

● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్‌ రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోవాలి.

● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్‌, ఎస్‌జీఎల్‌టీ 2 ఇన్‌హిబిటర్స్‌) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.

● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

● డయాబెటిక్‌ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్‌గా షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి.

● డాక్టర్‌ సలహా లేకుండా మందులు మానేయరాదు.

● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.

– డాక్టర్‌ ఎం.ప్రవన్‌కుమార్‌, ఎండీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, భూపాలపల్లి

వాహనాల బ్యాటరీపై అధిక లోడ్‌  ఉండకుండా చూసుకోవాలి..
– ఎండీ జాఫర్‌, సీనియర్‌ మెకానిక్‌

ఖిలా వరంగల్‌: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్‌ ఆయిల్‌ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్‌ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్‌ క్లాత్‌ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్‌ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్‌లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్‌ ఆయిల్‌ చెక్‌చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్‌ వేడి తగ్గి కూల్‌ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్‌ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్‌ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్‌ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్‌ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్‌ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్‌ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంటుంది.

చిన్న పిల్లల్లో హీట్‌ స్ట్రోక్‌
– డాక్టర్‌ సుధాకర్‌, పిడియాట్రిషన్‌

ఎంజీఎం : హీట్‌ స్ట్రోక్‌ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్‌ స్ట్రోక్‌కు గురవుతారు.

హీట్‌ స్ట్రోక్‌ లక్షణాలు..

● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది

● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.

● పసిపిల్లలు డల్‌గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.

● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.

● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్‌ఎస్‌ తాగించాలి.

● వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరింపజేయాలి.


మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
– నాగ ప్రసాద్‌, పశువైద్యాధికారి, బచ్చన్నపేట

జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్‌ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.

ప్రతీ ఇంట్లో ఎర్త్‌ వైరింగ్‌ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్‌, ఎలక్ట్రీషియన్‌

నెహ్రూసెంటర్‌: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్‌, టీవీ, ఏసీ, కూలర్‌, ఫ్యాన్‌, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్‌ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్‌ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్‌ వైరింగ్‌ చేయాలి. చార్జింగ్‌ తీసిన తర్వాత ఫోన్‌ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్‌ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్‌ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైతే మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌కు చూపించాలి.

ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్‌, రూఫ్‌ గార్డెన్‌ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరి పడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్‌ షేడ్‌నెట్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, క షాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. 
– చేరాల రాకేశ్‌, వరంగల్‌ ఉద్యాన అధికారి (టెక్నికల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement