
ఇరు కుటుంబాల ఘర్షణ
● అస్వస్థతకు గురైన వ్యక్తి మృతి
ఓర్వకల్లు: ఇళ్ల ముందు మురుగు కాల్వ విషయంలో జరిగిన ఘర్షణలో అస్వస్థతకు గురైన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ అల్లినగరం నా గరాజు (48) అనే వ్యక్తి తన ఇంటి ముందు వున్న మురుగు కాల్వ నుంచి దుర్వాసన రావడంతో బండతో మూసేశాడు. దీంతో పై వైపు వున్న బోయ బట్టి వెంకటరాముడు బండ ఎందుకు వేశావని .. నాగరాజును నిలదీశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోంది. ఆ తర్వాత బయటి నుంచి వచ్చిన నాగరాజు కొడుకు మహేంద్ర విషయం తెలుసుకుని వెంకటరాముడిని నిలదీయడంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు ఇరు కుటుంబాలకు నచ్చచెప్పారు. అయితే మానసిక ఒత్తిడికిలోనైన నాగరాజు అస్వస్థతకు గురై ఒక్కసారిగా సృహకోల్పోయి కింద పడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఇరు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.