
పోలీసుల విస్తృత తనిఖీలు
బొమ్మలసత్రం: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. శనివారం స్ధానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లు, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజాలు, చెక్‌పోస్టులు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నామన్నారు. నిషేధిత వస్తువులు, గంజాయి, అక్రమ మద్యం, పేలుడు పదార్థాల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
59 మందిపై కేసులు నమోదు
గడిచిన 48 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 59 మందిపై, బహిరంగంగా మద్యం సేవించిన 198 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నైట్ బీట్లలో భాగంగా ప్రతిరోజు పోలీస్ సిబ్బంది అనుమానితుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలు తీసుకుంటున్నారన్నారు. గడిచిన 48 గంటల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 647 మందిపై రూ.3.08 లక్షల జరిమానా విధించామన్నారు. పేకాట అడుతూ పట్టుబడిన ఏడు మంది పై కేసు నమోదు చేశామన్నారు.