కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ రెడ్డి విమర్శించారు. సోమవారం సలాంఖాన్ భవనంలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని, మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తామని, తాము అధికారాన్ని చేపట్టిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 117 రద్దు చేసి కొత్త పాఠశాలల విధానాన్ని అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి, కార్యదర్శి టి.కె జనార్దన్, నాయకులు వీరచంద్ర యాదవ్, సి.రమేష్, షఫీ పాల్గొన్నారు.