
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల గుండా జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కనీసం 250 నుంచి 300 మంది దాకా ఉగ్ర ముష్కరులు నక్కి ఉన్నట్టు బీఎస్‌ఎఫ్ శనివారం తెలిపింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచరముందని బీఎస్‌ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.
అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, వారి ఎత్తులను తిప్పికొడతాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సైన్యంతో కలిసి సమన్వయంతో సాగుతున్నామని విలేకరులకు వివరించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ వాసులతో భద్రతా దళాలకు అనుబంధం, సమన్వయం పెరుగుతోందని ఆయన తెలిపారు. వారి సహకారంతో స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామన్నారు.