
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్‌సీపీ సైతం తన పిటిషన్‌లో పేర్కొంది.
👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.
👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.
👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి.

👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది.
👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది.
👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.