రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’ | Is GST Nearing an End | Sakshi
Sakshi News home page

రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’

Published Sat, Aug 29 2020 2:32 PM | Last Updated on Sat, Aug 29 2020 5:18 PM

Is GST Nearing an End - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒక పన్ను’ అన్న సరికొత్త నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను విధించే అధికారాలను రాష్ట్రాల నుంచి లాక్కోవడం వల్ల దేశంలో సమాఖ్య భారత స్ఫూర్తి దెబ్బతింటుందని, పైగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుందని కొన్ని రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయం లోటును ఐదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని, జీఎస్టీ పరిహారం సెస్సు కింద ఈ మొత్తాలను చెల్లిస్తామని, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం భరోసా కూడా ఇచ్చింది. 

2020–21 సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు, వసూళ్లకు మధ్య ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల తేడా వచ్చింది. రాష్ట్రాలకు ఇస్తానన్న పరిహారపు సెస్సు వసూళ్లు 65 వేల కోట్ల రూపాయలను దాట లేదు. అంటే పరిహారపు సెస్సుపోనూ రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇదే విషయమమై గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నించగా, కేంద్రం ఉచిత సలహాలతో చేతులు దులిపేసుకుంది. పన్నుల ఆదాయం తగ్గిన మొత్తాలకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాల్సిందిగా కేంద్రం సలహా ఇవ్వడంతో రాష్ట్రాలు బెంబేలెత్తి పోతున్నాయి. 
(చదవండి : ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్‌బీఐ కొత్త సంస్థ)

ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడం, కోవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని భర్తీ చేయలేక పోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ పాత పన్నుల విధానాన్నే ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తమిళనాడు ఆది నుంచి నేటి వరకు కూడా జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. జీఎస్టీ పన్ను విధానాన్ని రద్దు చేసి పాత పన్ను విధానాలనే తిరిగి ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తుండగా, జీఎస్టీ వల్ల పెద్దగా నష్టపోని బీహార్, బెంగాల్‌ ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి. జీఎస్టీ కింద తమ రాష్ట్రానికి దాదాపు 5, 400 కోట్ల రూపాయలు రావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement