
విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది.
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద కుట్రకు తెరతీసిందని ఆరోపించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషిన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సాగింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాల ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు.
అనంతరం ముస్లిం పిటిషనర్ల తరఫున దుష్యంత్ దవే..‘హిజాబ్‌పై నిషేధంతో దేశంలోని మైనారిటీల మత విశ్వాసాన్ని దెబ్బతీసింది. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లింది’అని పేర్కొన్నారు. హిజాబ్ వంటి మతాచారాలు అత్యవసరమైనవి కాకపోయినా, ఒక వ్యక్తి నచ‍్చిన వాటిని ఆచరించే క్రమంలో కోర్టులు, యంత్రాంగం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.
ఇదీ చదవండి: హిజాబ్ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీంలో వాదనలు.. ఇష్టానుసారం కుదరదంటూ పిటిషనర్లకు మందలింపు