
తమిళనాడు: కుమార్తె పెళ్లికి భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. అయితే తల్లి మరణవార్త కుమార్తెకు తెలియనివ్వకుండా బంధువులు పెళ్లి జరిపించారు. వివరాలు.. తంజావూరు జిల్లా అయ్యనార్పురం గ్రామానికి చెందిన రంగస్వామి (55). ఇతని భార్య మాలతి (50). ఇద్దరూ రోజువారీ కూలీలు. వీరి కుమార్తె సుకీర్త, సతీష్ కుమార్ వివాహం గురువారం ఊరణిపురంలోని ఆలయంలో జరిగింది. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసిన దంపతులు రంగస్వామి, మాలతి ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై వివాహానికి వెళ్లారు. మోటారు సైకిల్‌ను రంగస్వామి నడిపాడు. మాలతి వెనక కూర్చుంది.
తిరువోణం సమీపంలోని కాళయరాయన్ రోడ్డులోని నరియట్రు వంతెన వైపు వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అనూహ్యంగా రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జి బారికేడ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలతి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అసుపత్రిలో చేర్చారు. కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామి తీవ్రంగా గాయపడగా.. మాలతి మృతి చెందడం బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
కూతురు పెళ్లి చేయబోతున్న సమయంలో ప్రమాదంలో రంగస్వామికి తీవ్రగాయాలు కాగా మాలతి మృతి చెందడం బంధువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే యాక్సిడెంట్‌లో తల్లి మరణించిన విషయాన్ని వధువుకు తెలియజేయకుండా పెళ్లి జరిపించాలని బంధువులు నిర్ణయించారు. ఆ ప్రకారమే సుకీర్త, సతీష్ పెళ్లి చేశారు. తర్వాత ప్రమాదంలో తల్లి చనిపోయిందని, తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయని బంధువులు వధువు సుకీర్తకు తెలిపారు. అది విని బోరున ఏడ్చింది. బంధువులు ఆమెను ఓదార్చారు. కూతురి పెళ్లి రోజునే ప్రమాదంలో తల్లి మృతి చెందడం బంధువులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.