
చిలమత్తూరు: ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. రొద్దంవారిపల్లి క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సౌభాగ్యమ్మ(40) అనే వివాహిత మృతి చెందింది. స్థానికులు, ఎస్‌ఐ జమాల్ బాషా తెలిపిన మేరకు... రొద్దంవారిపల్లి గ్రామానికి చెందిన నాగభూషణం, సౌభాగ్యవతి దంపతులు కుమారులు అభిలాష్, నరసింహలుతో కలిసి శనివారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమఘట్టలోని లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరుగుప్రయాణంలో సౌభాగ్యమ్మ తన కుమారుడు అభిలాష్‌తో కలిసి ద్విచక్రవాహనంలో వస్తోంది.
రొద్దంవారిపల్లి క్రాస్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన సౌభాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన అభిలాష్‌ను స్థానికులు గోరంట్ల ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు.