కొత్తకోట : వాళ్లంతా బంధువుల ఇంటిలో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. రెండ్రోజులు ఆనందంగా గడిపారు. వేడుకలు ముగియడంతో ఇంటికి కారులో పయనమయ్యారు. జాతీయ రహదారిపై వాహనం వేగంగా వెళ్తుండగా ఉన్నట్టుండి టైరు పగిలిపోయింది. రోడ్డుపక్కన కారుబోల్తాపడి ఇద్దరిని బలితీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలోని రహమత్‌నగర్ కాలనీకి చెందిన షేక్ నజీర్, అఫ్జల్ కుంటుంబ సభ్యులు కర్నూల్ జిల్లా బనగానపల్లెలో ఉన్న బంధువుల పెళ్లికి వెళ్లారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో హైదరాబాద్‌కు బయలు దేరారు. వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు టైర్ పగిలిపోయింది. పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన నౌషీన్(15), నూరీన్ (13) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న అఫ్జల్‌తోపాటు అబ్రార్, రఫత్‌కు గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఎన్‌ఎచ్–44 అంబులెన్స్ వాహనంలో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరిలించారు. సంఘటన స్థలానికి కానిస్టేబుల్ మురళీధర్‌రెడ్డి చేరుకొని మృతులు వివారాలు సేకరించారు.
అతివేగమే కారణమా?
కారు ప్రమాదానికి గురైన పరిస్థితిని గమనిస్తే సుమారు 100 కిపైగా స్పీడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ స్పీడ్‌లో కారు టైర్ ఒక్కసారిగా పగలడంతో గాలిలో పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. వాహనం నుజ్జునుజ్జు కావడం చూస్తే వాహన వేగం అతిగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇదిలాఉండగా సంఘటన జరిగిన సమయంలో నౌషిన్ ఓ 20 నిమిషాల పాటు ప్రాణంతో కొట్టుమిట్టాడినట్లు బాటసారి ఎస్‌కే గనీ తెలిపారు. కొత్తకోట అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో అరగంట తరువాత ఎన్‌ఎచ్–44కు చెందిన అంబులెన్స్ వచ్చిందని తెలిపారు. సమయానికి వచ్చి ఉంటే ఓ నిండు ప్రాణం బతికేదని అక్కడున్నవారు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment