వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ గజరావు భూపాల్
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు.
జహనుమా పయీంబాగ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అలియాస్ షోయబ్ (32)కు సంగారెడ్డికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సదరు యువతి గత నెల రోజులుగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ముంబైలోని ఓ బాబాను సంప్రదించారు. ఆరీఫ్ దగ్గరి బంధువులే ఆమెకు క్షుద్రపూజలు (చేతబడి) చేయించారంటూ సదరు బాబా చెప్పడంతో ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యుల ఆరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఆరీఫ్ హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న తన బావ (అక్క భర్త) మహ్మద్ సమీ మోయియుద్దీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. అతనే తనకు కాబోయే భార్యకు చేతబడి చేయించి ఉంటాడని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. తనకు కాబోయే భార్యకు నయం చేయించాలని పట్టుబట్టడంతో చేసేది లేక సమీ రూ. 50 వేలు ఇచ్చాడు.
అయినా ఆరీఫ్ తరచూ డబ్బుల కోసం బావను వేధించేవాడు. దీనిని భరించలేని సమీ అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నవాబుసాబ్‌కుంటకు చెందిన తన సోదరుడు మహ్మద్ అంజద్ మోయియుద్దీన్, అతడి స్నేహితులు మహ్మద్ అలీ, ఆమేర్ మహ్మద్ ఖాన్‌లకు కొంత డబ్బు ఇచ్చి ఆరీఫ్‌ను హత్య చేయాలని కోరాడు. ఈ నెల 13న రాత్రి ఇంటి సమీపంలో ఫోన్ మాట్లాడుతున్న ఆరీఫ్ కళ్లల్లో ఆమేర్ మహ్మద్ ఖాన్ కారం పొడి చల్లగా.....అంజద్, మహ్మద్ అలీ అతడిపై గొడ్డలి, కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్‌స్పెక్టర్ ఆర్.దేవేందర్, అదనపు ఇన్‌స్పెక్టర్ కె.ఎస్.రవికుమార్, ఎస్సై నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment