
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు.
ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు.
మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే.