
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఈ సమాచారాన్ని అధికారిక వర్గాలు మీడియాకు సూచనప్రాయంగా తెలిపాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఆయనను కలుసుకోనున్నారు.
2024 నవంబర్‌లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ట్రంప్ 2025, జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోపు ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నేతలలో మోదీ కూడా ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల తెలిపింది. వలసలు, సుంకాలపై అమెరికా అధ్యక్షుని అభిప్రాయాలపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని, చైనా వస్తువులపై అదనంగా 10 శాతం సుంకాన్ని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
జనవరి 27న ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాలలో భారతదేశం-అమెరికాలు భాగస్వామ్యంతో పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు భారత్ అణు బాధ్యత చట్టాన్ని సవరించడానికి, అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేయడానికి తనముందున్న ప్రణాళికలను ప్రకటించింది. ఈ నేపధ్యంలో అమెరికా నుంచి పౌర అణు సహకారం అందుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు