పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్‌.. పాక్‌ ఆర్మీ హస్తం? | LET saifullah sajid And Pakistan Army Behind Pahalgam | Sakshi
Sakshi News home page

పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్‌.. పాక్‌ ఆర్మీ హస్తం?

Published Wed, Apr 23 2025 11:51 AM | Last Updated on Wed, Apr 23 2025 1:20 PM

LET saifullah sajid And Pakistan Army Behind Pahalgam

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే, పహల్గాం దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్‌ ఉన్నట్టు తెలిసింది. దాడులకు పాల్పడింది తామేనని లష్కర్‌-ఏ-తోయిబా ముసుగు సంస్థ ది రిసిస్టెంట్‌ ఫ్రంట్ ప్రకటించుకుంది‌. అంతకుముందు సైఫుల్..లా ముజాహిదీలు కశ్మీర్‌లో దాడులు చేస్తారని ముందుగానే ప్రకటించాడు. త్వరలో కశ్మీర్‌ తమ గుప్పిట్లోకి వస్తుందన్న సైఫుల్లా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

మరోవైపు.. ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవల పాక్‌ ఆర్మీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఆధారంగా ఉన్నాయి. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను పాకిస్థాన్‌ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోము. ఇస్లామాబాద్‌కు కశ్మీర్‌ అంటే గొంతుకు వెళ్లే రక్తనాళం వంటిది. ప్రతీ విషయంలో మనం హిందువులకంటే విభిన్నమైన వారిమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం.

మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనం రెండు విభిన్న దేశాలు, ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్థాన్​ చరిత్రను మరిపోవద్దని మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. పహల్గాం దాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్‌ పాల్ వైద్ స్పందిస్తూ.. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉంది. రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీస్‌ భారత్‌పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్‌ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్‌కు అలానే చేయాలి.

వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్‌ సైన్యంలోని ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్‌) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అతను తానేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement