‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’ | Modi Pays Tribute To Pahalgam Victims In Bihar Public Meeting | Sakshi
Sakshi News home page

‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’

Published Thu, Apr 24 2025 1:17 PM | Last Updated on Thu, Apr 24 2025 2:26 PM

Modi Pays Tribute To Pahalgam Victims In Bihar Public Meeting

పాట్నా: జమ్మూకశ్మీర్‌ పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే వెతికి మరి మట్టిలో కలిపేస్తాం. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదుల్నే కాదు వారిని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుంది’ అని హెచ్చరించారు. 

ప్రధాని మోదీ గురువారం బీహార్‌లో (Bihar)పర్యటించారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బీహార్‌ రాష్ట్రం మధుబని నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను బలోపేతం చేసేందుకు వీలుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.  రూ.13,480 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సభలో మాట్లాడానికి ముందు పహల్గాం బాధితులకు రెండు నిమిషాల కళ్లు మూసుకుని శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.

 
‘పహల్గాం ఉగ్ర దాడిలో అమాయకులు చనిపోయారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం, ఆగ్రహం ఉన్నాయి. ఈ దాడి కేవలం అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు. భారత దేశ ఆత్మపై దాడి జరిగింది. దాడి చేసిన ఉగ్రవాదులు, దానికి కుట్ర పన్నిన వారికి మనం విధించే శిక్ష వారి ఊహకి కూడా అందదు. జమ్మూకశ్మీర్‌లోనే కాదు దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది.140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుందన్నారు.
 

సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా. భారత్‌ ప్రతి ఉగ్రవాదిని, వారికి వెనక ఎవరు ఉన్నా సరే వారిని గుర్తిస్తుంది. శిక్షిస్తుంది. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే వెంబడించి మరి మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది. న్యాయం జరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంకల్పంలో మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు. ఈ సమయంలో మనతో పాటు నిలిచిన ప్రపంచ దేశాల ప్రజలకు, వారి నాయకులకు నా కృతజ్ఞతలు’అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement