
బ్యాలెట్ ఓటింగ్‌పై కాంగ్రెస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఓటింగ్ కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు చేసిన సూచనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మనదేశ ఎలక్టోరల్ విధానం సమగ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు బ్యాలెట్ విధానమే సరైన సమాధానమని పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈవీఎంల విధానం చాలా ఖరీదైన వ్యవహారం.
దీనికి బదులుగా బ్యాలెట్ విధానాన్ని, ఒకే రోజు ఓటింగ్ చేపట్టడం వంటివి తీసుకురావడం మంచిది’అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా లక్షల సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అదేసమయంలో, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారు. ఇవన్నీ తెలిస్తే మోదీ మిత్రుడు ట్రంప్ సైతం షాకవుతారు’అని పేర్కొన్నారు. ‘ఈవీఎంలతో ఎన్నికల విధానాన్ని తారుమారు చేయవచ్చని ప్రపంచానికంతటికీ తెలిసినా బీజేపీ మాత్రం అమాయకత్వం ప్రదర్శించటం విషాదకరం. పారదర్శకతకు దూరంగా పారిపోయే బీజేపీ వైఖరి చూస్తే వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది’అని తెలిపారు.