
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్, నాగఫణిశర్మ, మిరియాల అప్పారావుకు పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులు సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. వైద్యరంగంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (పద్మవిభూషణ్), కళారంగంలో నందమూరి బాలకృష్ణ (పద్మభూషణ్), మాడుగుల నాగఫణిశర్మ (పద్మశ్రీ) పురస్కారాలు అందుకున్నారు.
మిరియాల అప్పారావు (పద్మశ్రీ) తరఫున ఆయన కుమార్తె యడవల్లి శ్రీదేవి అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జి.కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, శివరాజ్‌సింగ్ చౌహాన్, జితేంద్రసింగ్, ఏపీ మంత్రి లోకేశ్ దంపతులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖలు పాల్గొన్నారు.
బాలకృష్ణకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు
సాక్షి, అమరావతి: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వేర్వేరుగా అభినందనలు తెలిపారు. ‘కళ, సేవ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్టులో చేశారు. ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణది ప్రత్యేక స్థానం. ఆయన ప్రజాసేవలో, కళాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను..’ అని పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.