
జైపూర్: రాజస్థాన్‌లోని బీవార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి యాసిడ్ ఫ్యాక్టరీ గిడ్డంగి(Acid factory warehouse) లోపల ఆగి ఉన్న ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీకయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. బడియా ప్రాంతంలోని సునీల్ ట్రేడింగ్ కంపెనీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పలు పెంపుడు జంతువులు(Pets), వీదుల్లో తిరిగే జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ యజమాని సునీల్ సింఘాల్ మృతి చెందారు. ఆయన గ్యాస్ లీక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో గ్యాస్ ప్రభావానికిలోనై అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని అజ్మీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం కంపెనీ గిడ్డంగిలో ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీక్(Nitrogen gas leak) అయ్యింది. సెకెన్ల వ్యవధిలోనే సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీంతో 60 మందికి పైగా జనం చికిత్స కోసం బీవార్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజీని నియంత్రించగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. గ్యాస్ ప్రభావం తగ్గినప్పటికీ, స్థానికులలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేంద్ర ఖడ్గావత్ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. గ్యాస్ లీకేజీకి గల కారణాన్ని సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం