
పాక్ జైల్లో ఏళ్ల తరబడి మగ్గి.. దీనస్థితిలో మరణించిన భారతీయుడు సరబ్‌జిత్ సింగ్..
ఛండీగఢ్: ఉగ్రవాద ఆరోపణలతో ఏళ్లతరబడి పాక్ జైల్లో మగ్గి.. తోటి ఖైదీల చేతిలో ప్రాణాలు వదిలిన భారతీయుడు సరబ్‌జిత్ సింగ్ గుర్తున్నారా?.. ఆయన భార్య సుఖ్‌ప్రీత్ కౌర్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
టూవీలర్‌పై వెళ్తున్న సమయంలో.. ఫతేహ్‌పూర్ వద్ద వెనకాల కూర్చున్న సుఖ్‌ప్రీత్ కౌర్ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఇవాళ(మంగళవారం) తర్న్ తరన్‌లోని ఆమె స్వస్థలం భిఖివిండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. సరబ్‌జిత్ సింగ్-సుఖ్‌ప్రీత్ కౌర్‌లకు ఇద్దరు సంతానం. జూన్‌లో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్ ఛాతీ నొప్పితో కన్నుమూశారు. సరబ్‌జిత్ విడుదల కోసం దల్బీర్ కౌర్, సుఖ్‌ప్రీత్ చేసిన పోరాటం.. స్థిరస్థాయిగా గుర్తుండిపోయింది కూడా.
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో పట్టుబడ్డ సరబ్‌జిత్ సింగ్‌కు పాక్ కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే.. ఆ శిక్షను పలుకారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 2013, ఏప్రిల్‌లో తోటి ఖైదీల చేతిలో లాహోర్ జైల్లో దాడికి గురై.. కన్నుమూశారు. మరణాంతరం ఆయన మృతదేహాన్ని అమృత్‌సర్‌కు తీసుకొచ్చి.. అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: పశువుల పాలిట ప్రాణాంతకం ‘లంపీ’పై ప్రధాని స్పందన