
చర్మంతో చెప్పులు కుట్టుకుని పనిచేసే వాళ్లు నిండిన సభలో నేను పాండిత్యం చూపను.. అది నాకు అవమానం..
ఒక పురాణ కథ చెప్పుకుందాం.. రుషుల కాలంలో అష్టావక్రుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన కురూపి. శరీర నిర్మాణం సరిగా లేనివాడు. అయితేనేం.. అపరిమిత జ్ఞాన సంపన్నుడు! అనేక శాస్త్రాల మీద పట్టు సంపాదించిన వాడు. ఒకసారి ఏమైందంటే.. ఒక రాజుగారి ఆస్థానంలో పండిత గోష్టి జరుగుతోంది. ఎక్కడెక్కడినుంచో దూరదేశాల నుంచి వచ్చిన మహా పండితులు అక్కడి చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ సభకు అష్టావక్రుడు కూడా వచ్చాడు. ‘ఎవరివయ్యా నువ్వు.. ఇక్కడకు ఎందుకు వచ్చావు..’ అని అడిగారు రాజుగారు.
అష్టావక్రుడు తన గురించి చెప్పుకుని.. పండిత గోష్టిలో పాల్గొనడానికే వచ్చాననే సంగతి వెల్లడించాడు. అలా కురూపిగా ఉన్న ఆయన ఆ మాట చెప్పగానే.. సభలో ఉన్నవాళ్లలో చాలామంది ఫక్కున నవ్వారు. అలాంటి అనాకారి తాను పండితుడినని చెప్పగానే వారికి నవ్వొచ్చింది మరి. ఆ వెంటనే అష్టావక్రుడు వెనుతిరిగి సభనుంచి వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. రాజుగారు కంగారు పడ్డారు. తన ఆస్థనంలో సభ నుంచి ఒక పండితుడు అలా నిరసనగా తిరిగి వెళ్లిపోవడం తనకు అవమానం కదా అని భావించి, అతడిని వారించాడు. ‘పండితుడా.. ఎందుకు వెళ్లిపోతున్నావు’ అని అడిగాడు. అందుకు జవాబుగా అష్టావక్రుడు..
‘‘చర్మంతో చెప్పులు కుట్టుకుని పనిచేసే వాళ్లు నిండిన సభలో నేను పాండిత్యం చూపను.. అది నాకు అవమానం..’’ అని అన్నాడు. రాజుగారు ఖంగుతిన్నారు. ‘‘అదేమిటి ఇందరు పేరుమోసిన పండితులు కూర్చుని ఉన్న సభ నీకు.. తోలు చెప్పులు కుట్టుకునే వాళ్ల కూటమిలా కనిపిస్తున్నదా’’ అని కొంచెం కోపగించుకున్నారు కూడా!. అందుకు అష్టావక్రుడు.. ‘‘రాజా నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట అనలేదు. చర్మాన్ని చూసి విలువను లెక్కగట్టేవాళ్లు చెప్పులు కుట్టేవాళ్లే కదా..’’ అని అన్నాడు.
తన ఆకారాన్ని చూసి పాండిత్యాన్ని ఎలా నిర్ణయిస్తారని చెప్పాడు. రాజు కూడా నొచ్చుకున్నాడు. సభలోని సాటిపండితులు కూడా మన్నింపు వేడుకున్నారు. ఆ తర్వాత అష్టావక్రుడు పండితగోష్టిలో పాల్గొనడమూ.. తన పాండిత్యానికి తిరుగులేదని నిరూపించుకోవడమూ జరిగింది. ఇదీ కథ. ఎందుకో.. కునాల్ కమ్రా కు జరిగిన, జరుగుతున్న పరాభవం, హెచ్చరిక, సత్కార ఛీత్కారాలు గమనిస్తోంటే.. ఈ అష్టావక్రుడి కథ గుర్తుకు వస్తోంది.
ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం మనం..? ఒకడు కర్రపట్టుకుని కాపలా కూర్చుని.. ఈ దేశంలో ఎవడు ఏం మాట్లాడినా సరే.. నాకు నచ్చిన నాకు ప్రీతికరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి? అని శాసించే రాజ్యంలో బతుకుతున్నామా? అసభ్యపు మాటలతో, బూతులతో ఏమైనా అంటే.. వాటిని నేరాలుగా పరిగణించడానికి చట్టాలున్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేయడం కూడా ఉంది. ఏదైనా సరే.. చట్టం అనే ముసుగులో జరుగుతోంది. చట్టాన్ని మీరిన పనులు చేసినప్పుడు.. అలా అనిపించిన పనులు జరిగినప్పుడు జరుగుతోంది.
మరి చట్టం పరిధిలోకి రానటువంటి.. సమకాలీన సంగతులను హాస్యస్ఫోరకంగా, ఆలోచింపజేసే చిరు వెక్కిరింతగా ప్రస్తావించే మాటలకు కూడా మహోద్రేకంతో రగిలిపోయి.. కర్రపట్టుకుని దండించి తీరుతాం అని బరితెగించే మూకలు రాజ్యం చేస్తున్న చోట మనం ఎన్నాళ్లు బతకగలం?. నాయకులు తమ గురించి గొప్పలు చెప్పుకునేప్పుడు.. గతచరిత్రలోని చిన్నస్థాయి నేపథ్యాలను చాలా గర్వంగా వల్లెవేసుకుంటూ ఉంటారు కదా..! అదే నేపథ్యాల గురించి ఒక వెక్కిరింత వస్తే.. ఎందుకంత ఉడికిపోతుంటారు?
నోటికి వేసే తాళాలు తయారుచేసుకునే కంపెనీలకే ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రోజులు. కర్ర పట్టుకుని కాపలా తిరుగుతూ ఉండే.. కిట్టని మాటలు వినిపిస్తే మూతులు పగలగొట్టాలని చూసే కర్రదండు రాజ్యం చేస్తున్న నేలమీద మనం ఎంతకాలం జీవించగలం? మాట్లాడే స్వేచ్ఛ ఈ దేశంలో ప్రతి మనిషికీ ఉన్నదని అనుకోవడం ఒక భ్రమే కదా? అందరికీ మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది రాజ్యాంగం.. కానీ, కొందరికి కర్రపుచ్చుకుని దాడులు చేసి, చావచితగ్గొట్టే స్వేచ్ఛను ఇస్తున్నాయి ప్రభుత్వాలు!
-ఎం.రాజేశ్వరి