
సాక్షి, న్యూఢిల్లీ: మతపరమైన దుష్ప్రవర్తన కారణంగా రాజీనామా చేసిన ఐదు నెలల తర్వాత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఐడీ) చీఫ్‌గా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సమావేశానికి పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరైన 524 మంది ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్‌ను ఏకగ్రీవంగా తిరిగి ఎన్నుకున్నారు. తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్థానంలో 2008లో సుఖ్‌బీర్ తొలిసారిగా శిరోమణి చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అప్పటి నుంచి పార్టీ చీఫ్‌గా కొనసాగుతూ వస్తున్న ఆయన, గతేడాది రాజీనామా చేశారు. దాదాపు ఐదు నెలల కాలంలో మతపరమైన శిక్ష లేదా ‘తంఖా’ను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో అనుభవించారు. కాగా, ఈనెల 13న భటిండాలో జరిగే పార్టీ సమావేశంలో సుఖ్‌బీర్ ప్రసంగించనున్నారు. బాదల్ ఎన్నికతో పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న శిరోమణి అకాలీదళ్, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పాత మిత్రుడైన బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.