
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.
రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు.
ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది.

జరిగింది ఇదే..
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది.