Article 19
-
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది. -
కోర్టుల అతి జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగే.. పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాస్తవాన్ని నివేదించవచ్చు. ఆర్టికల్–19 ప్రకారం సత్యాన్ని వెల్లడించే హక్కు వాటికి ఉంది. దీనిని ఏ న్యాయస్థానం కాదనడానికి వీల్లేదు’.. అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం ఆయన స్పందించారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలతోపాటు 13 మందిపై ఆ రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన పలు అంశాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. వాస్తవాన్ని ప్రచురించకుండా, వెల్లడించకుండా అడ్డుకోవడమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని, అసాధారణ విషయాల్లో మాత్రమే న్యాయస్థానాలు ఇలాంటి ఆదేశాలిస్తాయని తెలిపారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా తమ అభిప్రాయాలతో, ఊహాగానాలతో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదముందని భావించినప్పుడు కూడా న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే, ఒక సంఘటనను, పరిణామాన్ని యధాతథంగా వెల్లడించేందుకు అడ్డుచెప్పాల్సిన అవసరంలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే ప్రజల సంక్షేమం కోసం విధానాలను రూపొందించి అమలుచేయడం ప్రభుత్వం బాధ్యత. అందులో న్యాయస్థానాలు అతిగా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పరిపాలనాపరమైన అన్ని అంశాల్లోనూ అంతిమ నిర్ణయం ప్రభుత్వానికే ఉంటుంది. అసలు విధానాలనే రూపొందించొద్దు, అమలుచెయొద్దని కోర్టులు చెప్పలేవు. ప్రభుత్వ విధానాలవల్ల, నిర్ణయాలవల్ల అన్యాయం జరిగితే అప్పుడు బాధితుల పక్షాన కోర్టులు తీర్పులు చెప్పవచ్చు. నేర విచారణ చెయ్యొచ్చు భూ కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, అవినీతి వంటివి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తే విచారణకు ఆదేశిస్తుంది. ఈ మేరకు విచారణ సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతాయి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ, అసలు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు అడ్డుకోవడం సహేతుకం కాదు. ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న మొత్తం నిర్ణయాలపైన విచారణ జరిపించడం సాధ్యంకాదు. బహుశా సాంకేతికంగా కూడా వీలుకాదు. ప్రభుత్వ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలతో, వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. సాంకేతిక కారణాలవల్ల ఆ ఒప్పందాలను యధాతథంగా అమలుచేసే అవకాశం లేనప్పుడు బాధితులకు తగిన పరిహారం అందజేయాలి. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. -
ఆలోచనను శిక్షించడం సమంజసమా ?
రాజ్యం తమకు వ్యతిరేకమైన ఆలోచన చేసేవారిని శిక్షించడం లేదా ఆలోచన మారే విధంగా శిక్షణ ఇవ్వడం ఈ రోజు జరుగుతున్న కొత్త పరిణామం. రాజ్యం లక్ష్యాలు, మనుగడ, కొనసాగింపు నిరాటంకంగా ఉండాలంటే దానికి అడ్డుగా వున్న వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా సంస్కరించే ప్రయత్నం చేయడం, కాకపోతే శిక్షించడం గతంలో జరిగింది. ఇక్కడ రాజ్యంకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అవి దాని కొనసాగింపులో అలాగే ఉంటే ఆ శిక్షలు ఒకే రకంగా వుండే వీలుంది. కానీ దాని లక్ష్యాలు రాజ్యపాలకుడు మారినప్పుడల్లా మారుతూ ఉంటే శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఈ కోవలోనే యుఏపీఏ చట్టం మార్చబడింది. దీనికి ముందు పోటా చట్టం అంతకంటే ముందు టాడా చట్టం తయారు చేశారు. ఇది ప్రధానంగా మావోయిస్టులను, ముస్లిం తీవ్రవాద కార్యక్రమాలను అడ్డుకోవడానికి వచ్చింది. కారణం ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు పరిశీలన చేసి దీన్ని తీసుకువచ్చారు. దీని కింద అరెస్ట్ అయినవారిలో కేవలం రెండు శాతం మందికే శిక్షలు ఖరారు అయ్యాయి. అంటే, అక్రమంగా అరెస్ట్ అయిన వేలాదిమంది జీవితాలు నాశనం అయినట్టే. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం పోటా తీసుకువచ్చింది. దీని క్రింద ఎక్కువగా రాజ్యం చాలా మందిని శిక్షించడం పేరుతో చంపివేసింది. దీని తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి బిల్లు సంస్థలనే కాకుండా వ్యక్తులను కూడా కేంద్రంగా చేసుకొని తెచ్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా హడావిడిగా బిల్లును తెచ్చారు. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా తీవ్రవాదిగా చూపించడానికి ఈ చట్టం వీలు కల్పి స్తుంది. ఒక సంస్థలో సభ్యులు కాకుండానే వ్యక్తిని కేంద్రంగా చూపిస్తూ తీవ్రవాదిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించవచ్చు. మనిషి ఆలోచనల ఆధారంగా అతనిపై చట్ట వ్యతిరేక ముద్ర వేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. సంస్థలను కాకుండా, వ్యక్తులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటే.. సంస్థలను నిర్వీర్యం చేస్తే వ్యక్తులు మరొక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నారనీ, కాబట్టి వ్యక్తులే లక్ష్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడం వీలవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా సంస్థలుగా రాజ్యంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చూపెడుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొనే కాకుండా వివిధ సామాజిక వర్గాలు రాజ్యంపై నిరసన ప్రకటించకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చట్టాన్ని సవరించారు. ఇప్పటికే సామాజిక సంస్థలు తమ గొంతు నొక్కడానికే ఈ చట్టం తెచ్చారని ఆరోపిస్తున్నాయి. 2018లో మహారాష్ట్ర భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే ఈ చట్టం క్రింద చాలా మందిని అరెస్ట్ చేశారు. దీని ప్రకారం ఇప్పట్నుండీ రాజ్యంను వ్యతిరేకిస్తున్న వంకతో తమను సామాజికంగా అణచివేస్తున్నారని, తమపై అత్యాచారాలు, హత్యలు సామూహిక దాడులు జరుపుతున్నారని అటువంటి వారిని రాజ్యం శిక్షించడం లేదని ఉద్యమాలు చేసే ప్రతి వ్యవస్థను, వ్యక్తులను ఈ చట్టం తో అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంటే మొత్తంగా ఈ దేశ దళితులు, ఆదివాసీలు ఇక వారికి దక్కవలసిన కనీస హక్కులు అమలు చేయమని రాజ్యంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అవకాశం లేనివిధంగా దీన్ని తీసుకువచ్చారు. సామాజిక అసమానతల ఆధారంగా రాబోయే ఉద్యమాలను అణచివేయడానికే ఈ చట్టం ప్రధానంగా తీసుకువచ్చారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 లోని అన్ని క్లాజులను అవమానించే విధంగా వుంది. అంటే రాజ్యంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదు. కనీసం ఆలోచనలు కూడ చేయకుండా ఉండేందుకు ఇది వచ్చింది. అసలు ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తిని చట్ట ప్రకారంగా శిక్షించడం ఏ కోణంలో సమంజసం? అలాగే ఈ సమాజంలో సామాజిక వ్యవస్థ వల్ల ఎన్నో అరాచకాలు, సామూహిక హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే వీటిని అడ్డుకునేందుకు కారణమైనవారిని శిక్షించడానికి రాజ్య మెందుకు మౌనంగా ఉంటుందని ఆందోళనలు చేసినా, ఈ రాజ్యం చర్యలు తీసుకునేట్టు లేదని ఆలోచించడం ఇప్పుడు నేరమౌతుంది. దొంతి భద్రయ్య వ్యాసకర్త న్యాయవాది, కరీంనగర్ మొబైల్ : 9966677149 -
గుజరాత్ కోర్టులో మోదీకి వ్యతిరేక తీర్పు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ రాసి ప్రచురించిన ఓ పుస్తకాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌ను బుధవారం సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి దవే ఈ కేసును పరిశీలిస్తూ.. ఆర్టికల్ 19ను ఉదహరించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేత జయేశ్షా ‘ఫేకూజీ హ్యావ్ ఢిల్లీ మా’ అనే పేరుతో మోదీపై వ్యంగ్యంగా పుస్తకం రాసి ప్రచురించారు. 2014 లోక్‌సభ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని రద్దు చేయాలంటూ సామాజిక కార్యకర్త నర్సింగ్ కోర్టులో దావా వేశారు. ఈ పుస్తకం మోదీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేటట్లు ఉందని సోలంకీ ఆరోపించారు. మోదీ ఎన్నికై రెండేళ్లేనని, స్వల్ప వ్యవధిలో హామీలు నెరవేర్చ డం కష్టమన్నారు. ఈ వాదనలతో సంతృప్తి చెం దని న్యాయమూర్తి తమ భావాలను తెలిపే హ క్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.