ఆలోచనను శిక్షించడం సమంజసమా ?  | Donti Bhadraiah Article On Article 19 Issue | Sakshi
Sakshi News home page

ఆలోచనను శిక్షించడం సమంజసమా ? 

Published Thu, Aug 22 2019 1:53 AM | Last Updated on Thu, Aug 22 2019 1:55 AM

Donti Bhadraiah Article On Article 19 Issue - Sakshi

రాజ్యం తమకు వ్యతిరేకమైన ఆలోచన చేసేవారిని శిక్షించడం లేదా ఆలోచన మారే విధంగా శిక్షణ ఇవ్వడం ఈ రోజు జరుగుతున్న కొత్త పరిణామం. రాజ్యం లక్ష్యాలు, మనుగడ, కొనసాగింపు నిరాటంకంగా ఉండాలంటే దానికి అడ్డుగా వున్న వ్యక్తులనైనా, వ్యవస్థలనైనా సంస్కరించే ప్రయత్నం చేయడం, కాకపోతే శిక్షించడం గతంలో జరిగింది. ఇక్కడ రాజ్యంకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అవి దాని కొనసాగింపులో అలాగే ఉంటే ఆ శిక్షలు ఒకే రకంగా వుండే వీలుంది. కానీ దాని లక్ష్యాలు రాజ్యపాలకుడు మారినప్పుడల్లా మారుతూ ఉంటే శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఈ కోవలోనే యుఏపీఏ చట్టం మార్చబడింది. దీనికి ముందు పోటా చట్టం అంతకంటే ముందు టాడా చట్టం తయారు చేశారు.

ఇది ప్రధానంగా మావోయిస్టులను, ముస్లిం తీవ్రవాద కార్యక్రమాలను అడ్డుకోవడానికి వచ్చింది. కారణం ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాలు పరిశీలన చేసి దీన్ని తీసుకువచ్చారు. దీని కింద అరెస్ట్‌ అయినవారిలో కేవలం రెండు శాతం మందికే శిక్షలు ఖరారు అయ్యాయి. అంటే, అక్రమంగా అరెస్ట్‌ అయిన వేలాదిమంది జీవితాలు నాశనం అయినట్టే. ఆ తరువాత ఎన్డీయే ప్రభుత్వం పోటా తీసుకువచ్చింది. దీని క్రింద ఎక్కువగా రాజ్యం చాలా మందిని శిక్షించడం పేరుతో చంపివేసింది.

దీని తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి బిల్లు సంస్థలనే కాకుండా వ్యక్తులను కూడా కేంద్రంగా చేసుకొని తెచ్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎంత మొత్తుకున్నా హడావిడిగా బిల్లును తెచ్చారు. ఇది ఎంత ప్రమాదం అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా తీవ్రవాదిగా చూపించడానికి ఈ చట్టం వీలు కల్పి స్తుంది. ఒక సంస్థలో సభ్యులు కాకుండానే వ్యక్తిని కేంద్రంగా చూపిస్తూ తీవ్రవాదిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించవచ్చు. మనిషి ఆలోచనల ఆధారంగా అతనిపై చట్ట వ్యతిరేక ముద్ర వేయడానికి ఇది ఉపయోగ పడుతుంది.  

సంస్థలను కాకుండా, వ్యక్తులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటే.. సంస్థలను నిర్వీర్యం చేస్తే వ్యక్తులు మరొక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నారనీ, కాబట్టి వ్యక్తులే లక్ష్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడం వీలవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు.  గత కొన్ని దశాబ్దాలుగా సంస్థలుగా రాజ్యంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చూపెడుతున్న వాటిని దృష్టిలో పెట్టుకొనే కాకుండా వివిధ సామాజిక వర్గాలు రాజ్యంపై నిరసన ప్రకటించకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చట్టాన్ని సవరించారు. ఇప్పటికే సామాజిక సంస్థలు తమ గొంతు నొక్కడానికే ఈ చట్టం తెచ్చారని ఆరోపిస్తున్నాయి.

2018లో మహారాష్ట్ర భీమా కోరేగావ్‌ ఘటనలో ఇప్పటికే ఈ చట్టం క్రింద చాలా మందిని అరెస్ట్‌ చేశారు. దీని ప్రకారం ఇప్పట్నుండీ రాజ్యంను వ్యతిరేకిస్తున్న వంకతో తమను సామాజికంగా అణచివేస్తున్నారని, తమపై అత్యాచారాలు, హత్యలు సామూహిక దాడులు జరుపుతున్నారని అటువంటి వారిని రాజ్యం శిక్షించడం లేదని ఉద్యమాలు చేసే ప్రతి వ్యవస్థను, వ్యక్తులను ఈ చట్టం తో అరెస్ట్‌ చేసే అవకాశం వుంది. అంటే మొత్తంగా ఈ దేశ దళితులు, ఆదివాసీలు ఇక వారికి దక్కవలసిన కనీస హక్కులు అమలు చేయమని రాజ్యంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అవకాశం లేనివిధంగా దీన్ని తీసుకువచ్చారు. సామాజిక అసమానతల ఆధారంగా రాబోయే ఉద్యమాలను అణచివేయడానికే ఈ చట్టం ప్రధానంగా తీసుకువచ్చారు.

ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 లోని అన్ని క్లాజులను అవమానించే విధంగా వుంది. అంటే రాజ్యంకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదు. కనీసం ఆలోచనలు కూడ చేయకుండా ఉండేందుకు ఇది వచ్చింది. అసలు ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తిని చట్ట ప్రకారంగా శిక్షించడం ఏ కోణంలో సమంజసం?  అలాగే ఈ సమాజంలో సామాజిక వ్యవస్థ వల్ల ఎన్నో అరాచకాలు, సామూహిక హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే వీటిని అడ్డుకునేందుకు కారణమైనవారిని శిక్షించడానికి రాజ్య మెందుకు మౌనంగా ఉంటుందని ఆందోళనలు చేసినా, ఈ రాజ్యం చర్యలు తీసుకునేట్టు లేదని ఆలోచించడం ఇప్పుడు నేరమౌతుంది. 


దొంతి భద్రయ్య 
వ్యాసకర్త న్యాయవాది, కరీంనగర్‌ 
మొబైల్‌ : 9966677149    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement